కాంగ్రెస్ పార్టీకి విజయశాంతి గుడ్ బై

తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచారకమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి ఆదివారం ఉదయం తన పదవికి, పార్టీ ప్రాదమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తాజా సమాచారం. ఒకటి రెండురోజులలో ఆమె బిజెపిలో చేరబోతున్నారంటూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ శనివారం చెప్పారు. కనుక ఆమె రాజీనామా చేయడం నిజమేనని భావించవచ్చు. ఆదివారం సాయంత్రం ఆమె ఢిల్లీకి చేరుకొని బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రహోంమంత్రి అమిత్ షాలతో భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. బిజెపి అధిష్టానం పిలుపు మేరకు బండి సంజయ్‌ కూడా ఆదివారం సాయంత్రం ఢిల్లీ వెళ్ళనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు జేపీ నడ్డా, బండి సంజయ్‌ తదితరుల సమక్షంలో విజయశాంతి బిజెపిలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. 

మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్‌ నేత ఎ.చంద్రశేఖర్‌ కూడా బిజెపిలో చేరేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. వికారాబాద్‌ జిల్లాకు చెందిన ఆయన గత కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారడంతో ఆయన కూడా బిజెపిలో చేరేందుకు అనుచరులతో చర్చిస్తున్నట్లు తాజా సమాచారం. జానారెడ్డి, ఆయన కుమారు రఘువీర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి బిజెపిలో చేరబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బహుశః అందుకే శనివారం గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్‌ నేతల కీలక సమావేశానికి జానారెడ్డి డుమ్మా కొట్టారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.