తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొంటున్నారు అందుకే...

జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టిఆర్ఎస్‌ ఓటమి, బిజెపి 44 డివిజన్‌లు గెలుచుకోవడంపై నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ నిన్న మీడియాతో మాట్లాడుతూ, “టిఆర్ఎస్‌ అధినాయకత్వంలో అహంభావం పతాకస్థాయికి చేరింది. పాలనలో అవినీతి పెరిగిపోవడంతో తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొంటున్నారు. అందుకే జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టిఆర్ఎస్‌కు గట్టిగా బుద్ది చెప్పారు. రాష్ట్రంలో బిజెపికి ప్రజాధారణ పెరుగుతోందని చెప్పడానికి దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలే తాజా ఉదాహరణగా నిలుస్తాయి. 

దుబ్బాకలో బిజెపి చేతిలో టిఆర్ఎస్‌ ఓటమి పాలవడంతో, సత్తా చాటుకోవాలనే ఆత్రంతో 2021 ఫిబ్రవరిలో జరుగవలసిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ముందుగానే నిర్వహించి బోర్లాపడ్డారు. లోక్‌సభ ఎన్నికలతోనే టిఆర్ఎస్‌ పతనం ప్రారంభం అయ్యింది. అప్పటి నుంచే సిఎం కేసీఆర్‌కు బిజెపి అంటే భయం పట్టుకొంది. ఆయన భయాలను నిజం చేస్తూ దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టిఆర్ఎస్‌ను బిజెపి ఓడించింది. 2023 శాసనసభ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే సిద్దం అవుతాము. సిరిసిల్లాలోనే మంత్రి కేటీఆర్‌ను ఓడించి మా సత్తా చూపిస్తాము. ఆ తరువాత 2024లో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంలో 15 లోక్‌సభ స్థానాలు గెలిచి ప్రధాని నరేంద్రమోడీకి బహుమతిగా అందజేస్తాము,” అని అన్నారు.