మేము ఆశించినట్లు ఫలితాలు రాలేదు: కేటీఆర్‌

జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో 100కు పైగా డివిజన్‌లు గెలుచుకొంటామని ఢంకా బజాయించి చెప్పిన టిఆర్ఎస్‌ కేవలం 55 మాత్రమే గెలుచుకొని ఓటమి పాలైంది. 

తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నిన్న ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “కనీసం మరో 20-25 స్థానాలైనా (మ్యాజిక్ ఫిగర్ 76) గెలుచుకొంటామని ఆశించాము. కానీ ఫలితాలు భిన్నంగా వచ్చాయి. కొన్ని డివిజన్‌లలో మా అభ్యర్ధులు చాలా స్వల్ప తేడాతో ఓడిపోవడం వలననే ఫలితాలు ఈవిధంగా వచ్చాయని భావిస్తున్నాము. రాజకీయాలలో గెలుపోటములు సహజం కనుక పార్టీ శ్రేణులు నిరాశ చెందనవసరం లేదు. ఈవిధంగా ఎందుకు జరిగిందో పార్టీలో సమీక్షించుకొని ఎక్కడ తప్పులు, లోపాలున్నాయో తెలుసుకొని సరిదిద్దుకొని ముందుకు సాగుతాము. ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పాలకమండలికి ఇంకా ఫిబ్రవరి వరకు పదవీకాలం ఉన్నందున మేయర్ పదవి గురించి తరువాత ఆలోచించి నిర్ణయం తీసుకొంటాము. ఈ ఎన్నికలలో టిఆర్ఎస్‌ విజయం కోసం కృషి చేసిన పార్టీ నేతలు, కార్యకర్తలు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని అన్నారు.