తెలంగాణ రాష్ట్రంలో భవన నిర్మాణాలకు, లే-అవుట్లు వేసేందుకు అనుమతుల మంజూరు ప్రక్రియను మరింత పారదర్శకంగా, సరళీకృతంగా చేస్తూ రూపొందించిన టీఎస్బిపాస్ విధానాన్ని, దానికి సంబందించిన వెబ్సైట్ను మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం హైదరాబాద్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఈ వెబ్సైట్ ద్వారా నూతనవిధానాన్ని ప్రయోగాత్మకంగా అమలుచేసి సత్ఫలితాలు వస్తున్నాయని నిర్ధారించుకొన్న తరువాత నేటి నుంచి దీనిని పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాము. ఈ నూతనవిధానంలో పదిమీటర్ల కంటే తక్కువ ఎత్తు కలిగి 600 గజాలలోపు నివాసగృహాల నిర్మాణాలకు దరఖాస్తుతోపాటు స్వీయదృవీకరణపత్రాన్ని జోడిస్తే చాలు...తక్షణమే అనుమతి లభిస్తుంది. అదే... పది మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు, 600 గజాలకంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే ఇళ్లకు 21 రోజులలోపుగా అనుమతి లభిస్తుంది. వీటికి కూడా స్వీయదృవీకరణపత్రంతో దరఖాస్తు చేసుకోవచ్చు. టీఎస్బిపాస్ వెబ్సైట్, మీ-సేవా కేంద్రాలలో, మునిసిపల్ కార్యాలయాలలో లేదా త్వరలో ప్రవేశపెట్టబోయే ‘టీఎస్బిపాస్ మొబైల్ యాప్’ ద్వారా ప్రజలు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రజలకు అత్యంత సౌకర్యవంతమైన, పారదర్శకమైన సేవలు వేగంగా అందించాలనే ఆలోచనతోనే ఈ నూతన విధానాన్ని ప్రవేశపెడుతున్నాము,” అని మంత్రి కేటీఆర్ అన్నారు.