త్వరలో టీఎస్‌ఆర్టీసీ కార్మికుల బకాయిలు చెల్లింపు

ప్రగతి భవన్‌లో ఆదివారం టీఎస్‌ఆర్టీసీపై సిఎం కేసీఆర్‌ సమీక్షాసమావేశం జరిపారు. రాష్ట్ర రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌, టీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. 

లాక్‌డౌన్‌ సమయంలో ఆర్టీసీ కార్మికుల జీతాలలో ప్రభుత్వం 50 శాతం కోత విధించింది. ఆ జీతాల బకాయిలను తక్షణమే చెల్లించాలని సిఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. దాని కోసం రూ. 120 కోట్లు విడుదల చేయాలని ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన తరువాత టీఎస్‌ఆర్టీసీ హైదరాబాద్‌లో 25 శాతం సిటీబస్సులు మాత్రమే నడిపిస్తోంది. ఇప్పుడు నగరంలో పరిస్థితులు మరింత మెరుగుపడినందున ఇక నుంచి 50 శాతం సిటీబస్సులు నడిపించాలని సిఎం కేసీఆర్‌ టీఎస్‌ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. నష్టాల ఊబిలో కూరుకుపోయిన టీఎస్‌ఆర్టీసీని కాపాడేందుకు ప్రవేశపెట్టిన కార్గో & పార్సిల్ సర్వీసులతో ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలు వస్తున్నందుకు సిఎం కేసీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం ప్రభుత్వాసంస్థలను ఒకటొకటిగా ప్రైవేట్ పరం చేస్తోందని, కానీ తమ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వసంస్థలను కాపాడేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ప్రభుత్వ సంస్థలలో లక్షలాదిమంది ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తుంటారని వారిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. లాభనష్టాల గురించి ఆలోచించకుండా తాను జీవించి ఉన్నంతవరకు టీఎస్‌ఆర్టీసీని కాపాడుకొంటానని సిఎం కేసీఆర్‌ అన్నారు.