
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీకి నాయకత్వ లక్షణాలు లేవని ఆ పార్టీలో సీనియర్లే అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం అందరికీ తెలుసు. అలాగే అనేక ఏళ్ళుగా రాజకీయాలలో ఉంటున్నప్పటికీ ఆయనకు ఇంకా రాజకీయపరిణతి రాలేదనేవారు కోకొల్లలు. ఇప్పుడు అమెరికా మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా కూడా రాహుల్ గాంధీకి సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఆయన కూడా రాహుల్ గాంధీకి పరిణతిలేదన్నట్లు అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం.
బారక్ ఒబామా వ్రాసిన ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’ అనే ఓ పుస్తకం ఈనెల 17న మార్కెట్లోకి విడుదలకానుంది. ఈ సందర్భంగా న్యూయార్క్ టైమ్స్ పత్రిక దానిని సమీక్షించి దానిలో ఒబామా పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలను బయటపెట్టింది. రాహుల్ గాంధీని ఉద్దేశ్యించి ఒబామా వ్యక్తం చేసిన అభిప్రాయం కూడా వాటిలో ఒకటి.
ఇంతకీ ఒబామా ఆ పుస్తకంలో రాహుల్ గురించి ఏమీ వ్రాశారంటే, “త్వరగా అన్ని పాఠాలు చదివేసి ఉపాధ్యాయుడిని మెప్పించాలని ప్రయత్నించే విద్యార్ధివంటివారు రాహుల్ గాంధీ. అయితే వాటి సారాంశాన్ని ఎన్నడూ ఆకళింపుచేసుకోని విద్యార్ధిగా రాహుల్ గాంధీని అభివర్ణించవచ్చు. అదే ఆయన బలహీనత,” అని ఒబామా అభిప్రాయం వ్యక్తం చేసారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది.
Barack Obama says he has “a nervous, unformed quality about him, as if he were a student who’d done the coursework and was eager to impress the teacher but deep down lacked either the aptitude or the passion to master the subject.”