తెలంగాణలో బాణాసంచాపై హైకోర్టు నిషేదం

ఈనెల 14న దీపావళి సందర్భంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బాణాసంచా దుకాణాలు ఏర్పాటవుతున్నాయి. కానీ బాణాసంచా విక్రయాలు, కాల్చడంపై హైకోర్టు నిషేధం విధించింది. రాష్ట్రంలో ఇంకా కరోనా ముప్పు తొలగిపోనందున ఈ చలీకాలంలో బాణాసంచా కాల్చినట్లయితే కాలుష్యం పెరిగి కరోనా తీవ్రత మళ్ళీ పెరిగే ప్రమాదం ఉంది కనుక బాణాసంచా విక్రయాలను, కాల్చడాన్ని నిషేదించాలని ఇంద్రప్రకాష్ అనే న్యాయవాది ఓ పిటిషన్‌ వేశారు. దానిపై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం తెలంగాణలో బాణాసంచా విక్రయాలను, కాల్చడాన్ని నిషేదిస్తున్నట్లు తీర్పు చెప్పింది. ఇప్పటికే రాష్ట్రంలో ఏర్పాటైన బాణాసంచా దుకాణాలను తక్షణం మూసివేయాలని, విక్రయాలను నిలిపివేయాలని ఆదేశించింది. బాణాసంచా కాల్చడం వలన కలిగే ప్రమాదం లేదా అనర్ధాల గురించి రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలకు తెలియజేయాలని ఆదేశించింది. 

ఇప్పటికే దేశంలో ఢిల్లీ, కర్ణాటక, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు బాణాసంచాపై నిషేధం విధించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించలేదు కానీ బాణాసంచా విక్రయాలను అడ్డుకొంటున్నట్లు సమాచారం. తెలంగాణలో బాణాసంచా కాలుష్యాన్ని నివారించాలని హైకోర్టు గట్టిగా నొక్కి చెప్పింది కనుక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కూడా దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది.