కేసీఆర్‌ మనుమడు హిమాంషు ఇంకా మైనర్ లేకపోతే...

బిజెపి జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్, టిఆర్ఎస్‌ ప్రభుత్వం, మునిసిపల్ శాఖా మంత్రి కేటీఆర్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “మునిసిపల్ శాఖా మంత్రి కేటీఆర్‌ చాలా అవగాహనారాహిత్యంతో కేంద్రం గురించి, ప్రధాని నరేంద్రమోడీ గురించి చాలా తప్పుగా మాట్లాడారు. మునిసిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే సిఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ వరదబాధితులకు రూ.550 కోట్లు మంజూరు చేస్తే, దానిని టిఆర్ఎస్‌ నేతలు, కార్యకర్తలు పంచుకొనితిన్నారు. 

తెలంగాణ ఏర్పడితే లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయనుకొంటే, ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, స్కూళ్ళు, కాలేజీలలోని సుమారు 3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా, తమ ఇంట్లో అందరికీ రాజకీయ ఉద్యోగాలు కల్పించుకొంటున్నారు. నిజామాబాద్‌లో కవిత ఓడిపోతే మేనేజిమెంట్ కోటాలో సీటు ఇచ్చినట్లు ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు. సిఎం కేసీఆర్‌ మనుమడు హిమాంషు ఇంకా మైనర్ లేకపోతే అతనికి కూడా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే లేదా రాజ్యసభ సీటో ఇచ్చేవారే. ఇవాళ్ళ కాకపోయినా మరో 4-5 ఏళ్ళలో అతనికీ ఏదో ఒక పదవి ఇవ్వడం ఖాయం. 

టిఆర్ఎస్‌లో తండ్రీకొడుకుల పాలన సాగుతుంటే, మజ్లీస్ పార్టీని అన్నదమ్ములునడిపిస్తున్నారు. టిఆర్ఎస్‌, మజ్లీస్ రెండూ కలిసి విశ్వనగరంగా ఉండే హైదరాబాద్‌ నగరాన్ని విషాదనగరంగా మార్చేసాయి. నగరంలో గోతులులేని రోడ్లు చూపించి జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ఓట్లు అడగాలని మునిసిపల్ మంత్రి కేటీఆర్‌కు సవాలు విసురుతున్నాను. హైదరాబాద్‌ నగరంలో వరదలు ఖచ్చితంగా ఆయన వైఫల్యమే. ఆయన తన వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకే కేంద్రప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఆరోపణలు చేస్తున్నారు తప్ప వాటిలో ఏమాత్రం నిజం లేదు. తెలంగాణకు కేంద్రప్రభుత్వం ఎప్పటికప్పుడు భారీగా నిధులు విడుదల చేస్తుంటే, ఒక్క పైసా విదిలించడంలేదని అబద్దాలు చెపుతున్నారు. కేంద్రం విడుదల చేసిన నిధులపై నేను బహిరంగ చర్చకు సిద్దంగా ఉన్నాను,” అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రం ఇచ్చిన నిధులతో రాష్ట్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించి వాటి కోసం కేంద్రప్రభుత్వం విడుదల చేసిన నిధుల వివరాలను ప్రకటించారు.