
టిఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి బిజెపిలో చేరేందుకు తెర వెనుక ఏర్పాట్లు చేసుకొంటున్నట్లు తెలుస్తోంది. 2014లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టిడిపి తరపున పోటీ చేసి గెలిచిన ఆయన రాష్ట్రంలో టిఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరిపోయారు. మళ్ళీ 2018లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా ఎన్నికలలో పోటీ చేసారు కానీ సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచే పార్టీలో ఆయనకు ప్రాధాన్యం తగ్గింది. ఆ తరువాత సబితా ఇంద్రారెడ్డి కూడా టిఆర్ఎస్లో చేరి మంత్రి పదవి పొందినప్పటి నుంచి పార్టీలో ఇమడలేక దూరంగా ఉంటున్నారు.
దుబ్బాక ఉపఎన్నికలలో టిఆర్ఎస్కు గట్టి పోటీనిచ్చిన బిజెపి త్వరలో జరుగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా తన సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. కనుక టిఆర్ఎస్లో తీగల వంటి అసంతృప్త నేతలను ఆకర్షించి పార్టీని బలపరుచుకొనేందుకు ప్రయత్నిస్తోంది. తీగల కూడా పార్టీలో ఇమడలేక ఇబ్బంది పడుతున్నారు కనుక బిజెపిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల బిజెపి నేతలు ఆయనను కలిసి మాట్లాడినట్లు సమాచారం. కనుక త్వరలోనే తీగల బిజెపిలోకి జంప్ చేయడం ఖాయంగానే ఉంది. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని ప్రాంతాలపై పూర్తి పట్టు సాధించిన టిఆర్ఎస్కు ఇప్పుడు తీగల అవసరం లేదు కనుక ఆయన పార్టీని వీడి వెళ్ళిపోదలిస్తే ఆపకపోవచ్చు.
మైలార్దేవుపల్లి టిఆర్ఎస్ కార్పొరేటర్ బిజెపిలోకి జంప్...
మైలార్దేవుపల్లి టిఆర్ఎస్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి బిజెపిలో చేరబోతున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ టిఆర్ఎస్లో చేరినప్పటి నుంచి తాను పార్టీలో నిత్యం అవమానాలే ఎదుర్కొంటున్నానని, అయినా పార్టీ అధిష్టానం పట్టించుకోకపోవడంతో బిజెపిలో చేరాలని నిశ్చయించుకొన్నట్లు చెప్పారు. ఈనెల 9వ తేదీన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో బిజెపిలో చేరబోతున్నట్లు తెలిపారు.