
రాష్ట్రంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న రూ.600 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర గృహనిర్మాణశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2.84 లక్షల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ నిర్మాణాలు వివిద దశలలో ఉన్నాయి. వీటిలో పట్టణ ప్రాంతాలలో 1.68 లక్షలు, గ్రామీణప్రాంతాలలో 1.16 లక్షల ఇళ్ళు నిర్మించబడుతున్నాయి.
జీహెచ్‌ఎంసీ పరిధిలో నిర్మింపబడుతున్న ఒక్కో ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.7.50 లక్షలు ఖర్చు చేస్తోంది. అదేవిదంగా మున్సిపాలిటీల పరిధిలో ఒక్కో ఇంటినీ రూ.5.30 లక్షలు, గ్రామీణ ప్రాంతాలలో రూ.5.04 లక్షల వ్యయంతో నిర్మిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ నిర్మాణం కోసం మొత్తం రూ. 9,200 కోట్లు ఖర్చు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం వివిద సంక్షేమ పధకాలకు కూడా గురువారం నిధులు విడుదల చేసింది. ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులు ఆమేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
• మైనార్టీ సంక్షేమం కోసం రూ. 30.09 కోట్లు
• దివ్యాంగులకు అవసరమైన పరికరాల కొనుగోలుకు రూ.7 కోట్లు
• బీసీ హాస్టల్ భవనాల నిర్మాణానికి రూ. 3.91 కోట్లు.