
ఈసారి దుబ్బాక ఉపఎన్నికల ప్రచారంలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు కనిపించినప్పటికీ, పోలింగ్ మాత్రం చాలా సజావుగా ముగియడం సంతోషించదగ్గ విషయం. కరోనా భయాలు వెంటాడుతున్నప్పటికీ ఓటర్లు ధైర్యంగా తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. దుబ్బాకలో 82.61 శాతం పోలింగ్ నమోదవడంతో అది తమ విజయావకాశాలకు సంకేతమని మూడు ప్రధాన పార్టీల అభ్యర్ధులు చెపుతున్నారు. ఈ ఉపఎన్నికలలో మేమే తప్పకుండా గెలుస్తామని మూడు పార్టీల అభ్యర్ధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పోలింగ్ ముగిసిన తరువాత టిఆర్ఎస్ అభ్యర్ధి సోలిపేట సుజాత మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్ ఆశీస్సులు, మంత్రి హరీష్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సహాయ సహకారాలు నాకు లభించాయి. తొలిసారిగా పోటీ చేస్తున్న నన్ను దుబ్బాక ప్రజలు ఎంతగానో ఆదరించారు. పోలింగ్ సరళిని బట్టి నేను భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నానని స్పష్టమైంది, “ అని అన్నారు.
ఈ ఉపఎన్నికలలో ఆమెకు గట్టి పోటీనిచ్చిన బిజెపి అభ్యర్ధి రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ, “నా గెలుపు కోసం మా పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఎన్నికల ప్రచారం చేసి నాకు అండగా నిలబడ్డారు. వారందరికీ నా కృతజ్ఞతలు. కరోనా భయాలున్నప్పటికీ భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి ఓట్లు వేశారు. వారు ఖచ్చితంగా టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకిస్తూ ఓట్లువేసినట్లు పోలింగ్ సరళిని బట్టి స్పష్టమవుతోంది. కనుక ఈ ఉపఎన్నికలలో నేనే ఖచ్చితంగా గెలుస్తాను,” అని అన్నారు.
టిఆర్ఎస్, బిజెపిల మద్య హోరాహోరీగా సాగిన ఈ పోరులో వెనుకబడిపోయిన కాంగ్రెస్ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “దుబ్బాకలో మా తండ్రి చెరుకు ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధే తప్ప టిఆర్ఎస్ కొత్తగా చేసిందేమీ లేదని ప్రజలు అర్ధం చేసుకొన్నారు. అందుకే మాకు ప్రజలు బ్రహ్మరధం పట్టారు కనుక నేను ఖచ్చితంగా గెలువబోతున్నాను. ఈ ఉపఎన్నికలలో మాకు బిజెపితోనే పోటీ తప్ప్ టిఆర్ఎస్‌తో కాదు. ఈసారి టిఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితం కాబోతోంది,” అని అన్నారు.