
రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించిన దుబ్బాక ఉపఎన్నికలకు నేడే పోలింగ్ జరుగనుంది. కరోనా కారణంగా పోలింగ్ సమయాన్ని మరొక గంట పెంచాలని ఎన్నికల సంఘం నిర్ణయించినందున ఇవాళ్ళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఓటర్లకు ధర్మల్ స్క్రీనింగ్ చేసి జ్వరం లేదని నిర్ధారించుకొన్న తరువాతే పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. ఒకవేళ జ్వరం లేదా అటువంటి లక్షణాలు కనిపిస్తే వారికి సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు పోలింగ్ వేసేందుకు అవకాశం కల్పిస్తారు.
కరోనా నేపధ్యంలో దుబ్బాక ఉపఎన్నికలు జరుగుతునందున ఎన్నికల సంఘం అన్ని జాగ్రత్తలు తీసుకొంది. ఓటర్లందరికీ మాస్కులు అందజేస్తోంది. ఎన్నికల సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఓటర్ల కోసం ప్రతీ ఎన్నికల కేంద్రం వద్ద శానిటైజర్లు, సబ్బు , నీళ్ళు వగైరా అన్ని ఏర్పాటు చేసింది.
ఈ ఒక్క స్థానానికి టిఆర్ఎస్, బిజ్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్ధులతో కలిపి మొత్తం 23 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. వారిలో సోలిపేట సుజాత (టిఆర్ఎస్), రఘునందన్ రావు (బిజెపి), చెరుకు శ్రీనివాస్ రెడ్డి (కాంగ్రెస్)ల మద్య ప్రధానంగా పోటీ నెలకొని ఉంది.
దుబ్బాక ఉపఎన్నికలు నియోజకవర్గంలో మొత్తం ఏడు మండలాలలో మొత్తం 148 గ్రామాలున్నాయి. వాటిలో మొత్తం 1,63,658 మంది ఓటర్లున్నారు. వారిలో 98,028 మంది పురుషులు, 1,00,779 మంది మహిళా ఓటర్లున్నారు.
ఈరోజు జరుగబోయే ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం దుబ్బాక నియోజకవర్గంలో 315 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటిలో 89 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి అక్కడ సజావుగా పోలింగ్ జరిపేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఎన్నికల కోసం 400 మంది ప్రిసైడింగ్ ఆఫెసర్లు, 400 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫెసర్లు, అదనంగా మరో 800 మంది పోలింగ్ అధికారులను నియమించింది.
మొట్టమొదటిసారిగా తమిళనాడుకు చెందిన ఐపిఎస్ ఆఫీసర్ సరోజ్ కుమార్ ఠాకూర్‌ను ఎన్నికల పరిశీలకుడిగా నియమించింది. అలాగే ఒక సీఆర్పీఎఫ్, మూడు ఏపీ ఎస్పీ బలగాలను మోహరించింది. వారు కాకుండా 2015 మంది పోలీసులను, వందల మంది పోలీస్ అధికారులను కూడా నియమించింది.
దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలు ఈనెల 10న వెలువడతాయి.