రఘునందన్ బావమరిది కారులో కోటి రూపాయలు స్వాధీనం

దుబ్బాక బిజెపి అభ్యర్ధి రఘునందన్ రావు మళ్ళీ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆయన బావమరిది సురభి శ్రీనివాస్ రావు హైదరాబాద్‌ బేగంపేటలోని విశాఖ ఇండస్ట్రీస్ట్ కార్యాలయం నుంచి కారులో కోటి రూపాయలు దుబ్బాకకు తరలిస్తుండగా నార్త్ జోన్ పోలీసులు పట్టుకొన్నారు. సిపి అంజనీకుమార్ ఆ వివరాలను మీడియాకు తెలియజేశారు. 

బిజెపి అభ్యర్ధి రఘునందన్ రావు బావమరిది సురభి శ్రీనివాస్ రావు చందానగర్‌లో నివాసం ఉంటూ పటాన్ చెరులో ఏ టూ జెడ్ అనే ఓ సంస్థను నడుపుతున్నారు. ఆయన నిన్న ఓ ఇన్నోవా కారు (టిఎస్ 09 ఈఎఫ్6909)లో డ్రైవర్ రవికుమార్‌తో కలిసి బేగంపేటలోని విశాఖ ఇండస్ట్రీస్ట్ కార్యాలయానికి వెళ్ళి ఆ సంస్థ మేనేజర్ నుంచి కోటి రూపాయలు తీసుకొన్నారు. ఆ కార్యాలయం పెద్దపల్లి మాజీ ఎంపీ జీ.వివేక్‌కు చెందినదిగా గుర్తించాము. సురభి శ్రీనివాస్ రావు ఆ డబ్బును దుబ్బాకకు తీసుకువెళుతున్నట్లు మాకు సమాచారం అందడంతో బేగంపేటలో వారి కారును నిలిపి తనికీలు చేయగా దానిలో కోటి రూపాయలు నగదు లభించింది. దానిని దుబ్బాకలో ఓటర్లకు పంచిపెట్టేందుకు తీసుకువెళుతున్నట్లు వారు అంగీకరించారు. దాంతో వారిరువురినీ, కారు, నగదు, వారి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని, వారిని, కారును బేగంపేట పోలీసులకు అప్పగించాము. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతారు,” అని చెప్పారు.