ఇటీవల రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ దుబ్బాకలో పర్యటిస్తున్నప్పుడు పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ గంగుల శ్రీనివాస్ యాదవ్ అనే బిజెపి కార్యకర్త ఆదివారం మధ్యాహ్నం సుమారు 12.30 గంటలకు హైదరాబాద్‌లోని బిజెపి కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొన్నాడు. మంటలలో కాలిపోతూ, “నమో మోడీ...బిజెపి జిందాబాద్...బండి సంజయ్ జిందాబాద్...”అంటూ నినాదాలు చేశాడు. వెంటనే కార్యాలయ సిబ్బంది, స్థానికులు నీళ్ళుపోసి మంటలను ఆర్పి అంబులెన్స్‌ను పిలిపించి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఈ సమాచారం అందుకొన్న బండి సంజయ్ దుబ్బాకలో తన ప్రచారాన్ని నిలిపివేసి హుటాటాహుటిన హైదరాబాద్ వచ్చి శ్రీనివాస్‌ను పరామర్శించారు. అనంతరం ఆయన సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అతనిని యశోదా ఆసుపత్రికి తరలించారు. అంత బాధలోను శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, “దుబ్బాక ఉపఎన్నికలలో బిజెపి తప్పకుండా గెలుస్తుంది. రాష్ట్రంలో బిజెపిని, మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను, మా అభ్యర్ధి రఘునందన్ రావును సిఎం కేసీఆర్ ఏమీ చేయలేరు,” అని చెప్పడం విశేషం.
50 శాతంపైగా కాలిన గాయాలవడంతో శ్రీనివాస్ యాదవ్ పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసుల తాజా సమాచారం ప్రకారం... శ్రీనివాస్ యాదవ్ (26) స్వస్థలం రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని తమ్మలోనిగూడెం. ఇంటర్మీడియెట్ వరకు చదువుకొని నగరంలో ఓ ప్రైవేట్ కంపెనీలో కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. నిన్న మధ్యాహ్నం చేతిలో పెట్రోల్ డబ్బా, అగ్గిపెట్టెతో బిజెపి కార్యాలయానికి చేరుకొని “మన అధ్యక్షుడు బండి సంజయ్ లోపల ఉన్నారా?”అని సిబ్బందిని అడిగాడు. వారు లేరని సమాధానం చెప్పడంతో వెంటనే డబ్బాలో పెట్రోల్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకొన్నాడు. ఆ ఘటనతో బిజెపి కార్యాలయ సిబ్బంది షాక్ అయ్యారు. వెంటనే తేరుకొని నీళ్ళు పోసి మంటలు ఆర్పి ఆసుపత్రికి తరలించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, ఎంపీ అరవింద్, బిజెపి నేతలు చింతల రామచంద్రారెడ్డి, లక్ష్మణ్ తదితరులు శ్రీనివాస్ యాదవ్‌ను పరామర్శించి అతని తల్లితండ్రులను ఓదార్చారు.