బిహార్‌లో మొదటిదశ పోలింగ్ షురూ

బిహార్‌ శాసనసభ ఎన్నికలలో తొలిదశకు నేడు పోలింగ్ ప్రారంభం అయ్యింది. మొత్తం 243 స్థానాలలో ఇవాళ్ళ 71 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ 71 స్థానాలకు మొత్తం 1,066 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఈరోజు జరుగుతున్న మొదటిదశ పోలింగ్‌ కోసం ఎన్నికల సంఘం 31,371 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇవాళ్ళ 2.14 కోట్లు మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. వారిలో పురుషులు 1.12 కోట్లు, మహిళలు 1.01 కోట్ల మంది, ట్రాన్స్ జెండర్స్ 599 మంది ఉన్నారు. 

బిహార్‌లో అధికార జేడీయూ 35, బిజెపి 29 స్థానాలలో కలిసి పోటీ చేస్తుండగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ 42, కాంగ్రెస్ పార్టీ 20, ఎల్జెపీ 41 స్థానాలలో పోటీ చేస్తున్నాయి. 

బిహార్‌లో 2వ దశలో 94 స్థానాలకు పోలింగ్ నవంబర్‌ 3న, 3వ దశలో 78 స్థానాలకు పోలింగ్ నవంబర్‌ 7న జరుగనున్నాయి. ఎన్నికల ఫలితాలు నవంబర్‌ 10న వెలువడతాయి. కరోనా నేపధ్యంలో ఈసారి పోలింగ్‌ ప్రక్రియలో చాలా భారీ స్థాయిలో మాస్కూలు, పీపీఈ కిట్లు, గ్లౌజులు, శానిటైజర్లను ఎన్నికల సంఘం ఏర్పాటుచేసింది.