రఘునందన్ రావు మామ, బందువుల ఇళ్ళలో సోదాలు

దుబ్బాక ఉపఎన్నికలలో బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రఘునందన్ రావు ఇళ్ళు, కార్యాలయాలతో పాటు ఆయన మామ, సమీపబందువుల ఇళ్ళలో సోమవారం పోలీసులు సోదాలు జరిపారు. ఈ విషయం తెలుసుకొన్న రఘునందన్ రావు, బిజెపి కార్యకర్తలు ప్రచారం నిలిపివేసి అక్కడకు చేరుకొని పోలీసులను అడ్డుకొన్నారు. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ఏ కారణం చెప్పకుండా పోలీసులు ఏ అధికారంతో ఎవరి ఆదేశాలతో తమ ఇళ్ళలో దూరి సోదాలు నిర్వహిస్తున్నారో చెప్పాలని నిలదీశారు.

పోలీసులు టిఆర్ఎస్‌ కార్యకర్తలల్లాగ మంత్రి హరీష్‌రావు కనుసన్నలలో పనిచేస్తున్నారని రఘునందన్ రావు ఆక్షేపించారు. దుబ్బాకలో తన చేతిలో టిఆర్ఎస్‌ అభ్యర్ధి ఓడిపోతారనే భయంతోనే పోలీసులను తమ ఇళ్ళపైకి పంపిస్తున్నారని మంత్రి హరీష్‌రావుపై రఘునందన్ రావు మండిపడ్డారు. ఈ సందర్భంగా పోలీసులకు వారికి మద్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

పోలీసులను కదలనీయకుండా బిజెపి కార్యకర్తలు చుట్టుముట్టడంతో కాసేపు అక్కడ తీవ్ర ఉద్రిక్తవాతావరణం నెలకొంది. పోలీసులు తమ ఇళ్ళలో ఏమి స్వాధీనం చేసుకొన్నారో అక్కడే ప్రకటించాలని రఘునందన్ రావు, ఆయన బందువులు పట్టుబట్టారు. రఘునందన్ రావు బందువు ఇంట్లో నుంచి రూ.18.67 లక్షలు స్వాధీనం చేసుకొన్నట్లు పోలీసులు ప్రకటించారు.