
ఎన్నికల సంఘం సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకటరామిరెడ్డిని సంగారెడ్డికి బదిలీ చేసింది. అలాగే ఆయనను మెదక్ జిల్లా అదనపు బాధ్యతల నుంచి తప్పించి సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఎం.హనుమంతరావును మెదక్ జిల్లా కలెక్టర్‌గా నియమించింది. పి.వెంకటరామిరెడ్డి స్థానంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరికి సిద్ధిపేట జిల్లా కలెక్టరుగా నియమించింది. ఆమె పెద్దపల్లి జిల్లాకు కూడా ఇన్‌ఛార్జ్ కలెక్టరుగా కూడా వ్యవహరిస్తున్నారు.
గత 4 ఏళ్ళుగా సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌గా వ్యవహరిస్తున్న పి.వెంకటరామిరెడ్డి పనితీరును సిఎం కేసీఆర్ స్వయంగా అనేక సందర్భాలలో ప్రశంసించారు. తాను స్వయంగా జిల్లాబాగోగులు చూసుకోలేకపోయినా ఆయన చాలా చక్కగా చూసుకొంటుండటంతో నిశ్చింతగా ఉండగలుగుతున్నాని ప్రశంసించారు. కనుక ఆయన దుబ్బాక ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఆయనను బదిలీ చేయాలని కాంగ్రెస్, బిజెపిలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసాయి. వాటి అభ్యర్ధన మేరకు ఎన్నికల సంఘం ఆయనను వేరే జిల్లాకు బదిలీ చేయాలని ప్రభుత్వానికి సూచించడంతో ఈ బదిలీలు జరిగినట్లు భావించవచ్చు.
దుబ్బాక ఉపఎన్నికలు వచ్చే నెల 3వ తేదీన జరుగబోతున్నాయి. ఈ సమయంలో జిల్లాకు కొత్త కలెక్టర్ రావడం ఎన్నికలపై ఏ మాత్రం ప్రభావం చూపుతుందా...లేదా? అనే విషయం రానున్న రోజులలో తెలుస్తుంది.