ముంపు ప్రాంతాలలో పర్యటించిన మంత్రి కేటీఆర్‌

మునిసిపల్ శాఖా మంత్రి కేటీఆర్‌ గురువారం హైదరాబాద్‌లో వరద ముంపు ప్రాంతాలలో పర్యటించి ప్రజల పడుతున్న కష్టాలను, బాధలను స్వయంగా చూసి, వారి సమస్యలన్నీ తీర్చుతానని భరోసా ఇచ్చారు. మంత్రి కేటీఆర్‌ స్వయంగా నీళ్ళలో దిగి కాలనీలలో తిరగడంతో అధికారులు, స్థానిక ప్రజాప్రతిధులు అందరూ కూడా ఆయనను అనుసరించక తప్పలేదు. మంత్రి కేటీఆర్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, జోనల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి, ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఇంకా పలువురు అధికారులు ముంపు ప్రాంతాలలో పర్యటించారు. 

అంబర్‌పేట డివిజన్ పరిధిలోని ప్రేమ్‌నగర్‌ ప్రాంతంలో 20 ఏళ్లుగా నాలా సమస్య ఉందని స్థానికులు చెప్పగా, వర్షాలు తగ్గగానే ఆ సమస్యను శాస్వితంగా పరిష్కరిస్తానని చెప్పారు. రెండు రోజుల్లో అవసరమైన నిధులు విడుదల చేస్తానని చెప్పారు. ఆ తరువాత మజ్లీస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో కలిసి టోలీచౌకిలోని నదీంకాలనీలో పర్యటించి అక్కడి ముంపు ప్రాంతాలను పరిశీలించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. 

ఆ తరువాత రాంనగర్ డివిజన్‌లోని హుస్సేన్ సాగర్ నాలాను అనుకొనున్న శ్రీరాంనగర్, కమాన్ బస్తీలలో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. హుస్సేన్ సాగర్ నాలాకు ఇరువైపులా రీటెయినింగ్ వాల్ నిర్మించినట్లయితే వరదముప్పు తగ్గుతుందని అధికారులు సూచించడంతో దాని కోసం రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. వర్షాలు తగ్గగానే రీటెయినింగ్ వాల్ నిర్మాణ పనులు మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాలను స్వయంగా చూసినందున ఈ సమస్యలన్నిటినీ దశలవారీగా పరిష్కరిస్తానని వచ్చే ఏడాది వర్షాకాలంనాటికి మళ్ళీ ఈ సమస్య పునరావృతం కాకుండా ఉండేందుకు గట్టిగా కృషి చేస్తానని మంత్రి కేటీఆర్‌ ప్రజలకు హామీ ఇచ్చారు.