4.jpg)
సిఎం కేసీఆర్ ఆర్ధికసాయం చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోడీకి ఓ లేఖ వ్రాశారు. తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో సుమారు రూ.5,000 కోట్లకు పైగా నష్టం జరిగి ఉండవచ్చని అంచనా వేశామని, కనుక అత్యవసరంగా రూ.1,350 కోట్లు మంజూరు చేయాలని కోరారు. దానిలో రూ.600 కోట్లు రైతులకు పంటనష్టం చెల్లింపులకు, మిగిలిన సొమ్మును జీహెచ్ఎంసీ, పరిసర ప్రాంతాలలో పునరావసం, మౌలికవసతుల పునరుద్దరణ, నష్టపరిహారాల కోసం వినియోగిస్తామని సిఎం కేసీఆర్ లేఖలో తెలిపారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని తక్షణం రూ.1,350 కోట్లు విడుదల చేసి రాష్ట్రాన్ని ఆదుకోవాలని సిఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్లో నెలకొన్న పరిస్థితుల గురించి తెలుసుకొన్న ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా ఇద్దరూ సిఎం కేసీఆర్తో ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రానికి అవసరమైన సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్లో నీట మునిగిన కాలనీలలో పర్యటిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులకోసం కేంద్రానికి అభ్యర్ధన పంపితే వీలైనంత త్వరగా నిధులు మంజూరు చేయించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
సిఎం కేసీఆర్ కోరినట్లు రూ.1,350 కోట్లు కాకపోయినా కనీసం రూ.1,000 కోట్లు అయినా విడుదల చేస్తే సంతోషమే. కానీ అలవాటు ప్రకారం అడిగినదానిలో సగం మాత్రమే విదిలించి కేంద్రప్రభుత్వం చేతులు దులుపుకొంటే, ఈ సమస్యల నుంచి గట్టెక్కడానికి రాష్ట్ర ప్రభుత్వానికి చాలా సమయం పట్టవచ్చు. కేంద్రప్రభుత్వం ఎంత సొమ్ము ఎప్పుటిలోగా విడుదల చేస్తుందో చూడాలి.