రుద్రారంలో గండికొట్టి నీటిని విడుదల చేసిన అధికారులు

సూర్యాపేట జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, జిల్లా సాగునీటి అధికారులు మూసీ ప్రాజెక్టును కాపాడేందుకు రుద్రారంలో కాలువకు ఇవాళ్ళ ఉదయం జేసీబీతో గండికొట్టించి నీళ్ళను బయటకు వదిలారు. ఆ ప్రాజెక్టు సామర్ధ్యం 4.46 క్యూసెక్కులు, గరిష్ట నీటి మట్టం 645 అడుగులు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి చాలా భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో మొత్తం 13 క్రస్ట్ గెట్లను పైకి ఎత్తి 1.58 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. అయినా బుదవారం ఉదయానికి ప్రాజెక్టులో మరో 1.83 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. గంటగంటకూ ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతూనే ఉంది. ఇంకా పెరిగితే ప్రాజెక్టు మొత్తం కుప్పకూలిపోయే ప్రమాదం ఉంటుంది కనుక రుద్రారం వద్ద కాలువకు గండి కొట్టి నీటిని బయటకు విడుదల చేశారు. దాంతో వారు ఊహించినట్లే ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిపోయి సాధారణ స్థితికి చేరుకొంది.

అయితే కాలువకు గండికొట్టి నీటిని కిందకు విడుదల చేయడంతో నల్గొండలోని 17 గ్రామాలలోకి నీళ్ళు చేరే ప్రమాదం ఉంటుంది కనుక నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ముందుగానే లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపజేశారు. మరో రెండు, మూడు రోజుల వరకు ప్రజలెవరూ మూసీనది వద్దకు వెళ్ళకుండా అడ్డుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలోని టేకుమట్ల గ్రామంలోని పొలాలలో నుంచి ఆ నీళ్ళు మళ్ళీ మూసీనదిలో కలుస్తాయి.    

1963లో మూసీనదిపై ఈ ప్రాజెక్టును నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎన్నడూ ఇటువంటి వైపరీత్యం ఏర్పడలేదు. ప్రాజెక్టును కాపాడుకోవడం కోసం మొట్టమొదటిసారిగా కాలువకు గండి కొత్తవలసి వచ్చిందని అధికారులు చెప్పారు. దీని కింద నకిరేకల్, కేతిపల్లి, సూర్యాపేట మండలాలలో సుమారు 40,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది.