జీహెచ్‌ఎంసీలో 50 శాతం సీట్లు మహిళలకే

ఇవాళ్ళ జరిగిన ఒక్కరోజు సమావేశంలో నాలుగు చట్టసవరణలను శాసనసభ ఆమోదించింది. ఆ వివరాలు: 

1. ఇండియన్ స్టాంప్ బిల్లు (తెలంగాణ)-2020

2. తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ సవరణ బిల్లు(కన్వర్షన్ నాన్  అగ్రికల్చర్ ల్యాండ్)-2020

3.  క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్లు- 2020 

 4. జీహెచ్ఎంసీ సవరణ బిల్లు-2020 

వీటిలో జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ బిల్లులో భాగంగా పాలకమండలిలో 50 శాతం సీట్లు మహిళలకు కేటాయింపు. మహిళలకు సాధికారత కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నామని మునిసిపల్ శాఖా మంత్రి కేటీఆర్‌ చెప్పారు. బీసీలకు యధాతధంగా రిజర్వేషన్లు కొనసాగుతాయని తెలిపారు.

ఇక నుంచి ప్రతీ 10 ఏళ్ళకు ఒకసారి మాత్రమే జీహెచ్‌ఎంసీ రిజర్వేషన్లలో మార్పు చేయాలనే చట్టసవరణకు శాసనసభ ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్, పురపాలక చట్టాలలో అమలుచేస్తున్న ఈ రిజర్వేషన్ల  విధానం సత్ఫలితాలు ఇస్తున్నందున ఇప్పుడు దానిని జీహెచ్‌ఎంసీకి కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  

జీహెచ్‌ఎంసీలో యూత్ కమిటీ, మహిళా కమిటీ, సీనియర్ సిటిజన్ కమిటీ, ఎమ్మినెంట్ సిటిజన్ కమిటీ అనే నాలుగు రకాల వార్డు కమిటీలను ఏర్పాటు చేసేందుకు శాసనసభ ఆమోదం తెలిపింది. నగర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ కమిటీలు ఏవో నామమాత్రంగా కాకుండా శక్తివంతమైన కమిటీలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. వీటికి సంబందించి విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. 

జీహెచ్‌ఎంసీ పరిధిలో పచ్చదనం పెంచేందుకుగాను ప్రస్తుతం 2.5 శాతం ఉన్న గ్రీన్‌ బడ్జెట్‌ను 10 శాతానికి పెంచేందుకు శాసనసభ ఆమోదం తెలిపింది.

ఇకపై జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు సంబందించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకోదలచినా ఆ విషయం తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని చట్టసవరణకు శాసనసభ ఆమోదం తెలిపింది.