
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర భూములను క్రమబద్దీకరణ (ఎల్ఆర్ఎస్) కోసం గతంలో దరఖాస్తు చేసుకొన్నవారు మళ్ళీ దరఖాస్తు చేసుకోనవసరం లేదు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నేటికీ ఎల్ఆర్ఎస్-2015 చట్టంలో నిబందనలే అమలులో ఉన్నందున ఈ ఏడాది జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకొన్నవారు మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోనవసరం లేదు. అపరిష్కృతంగా ఉన్న ఆ దరఖాస్తులను వెంటనే పరిశీలించి అన్ని సక్రమంగా ఉన్నట్లు నిర్ధారణ వాటన్నిటినీ క్రమబద్దీకరించాలని ఆదేశిస్తూ జీహెచ్ఎంసీ కమీషనర్, హెచ్ఎండీఏ కమీషనర్, కుడా వైస్ ఛైర్మన్, రాష్ట్రంలో అన్ని మునిసిపాలిటీల కమీషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులకు ఉత్తర్వుల ద్వారా ఆదేశాలు జారీ చేశారు. దీంతో గత 5 ఏళ్ళుగా అపరిష్కృతంగా పడున్న దరఖాస్తులకు త్వరలోనే మోక్షం కలిగే అవకాశం ఉంది. ప్రభుత్వమే క్రమబద్దీకరణకు అవకాశం కల్పిస్తూ 2015లో అవకాశం కల్పించినప్పటికీ, నేటికీ రాష్ట్రవ్యాప్తంగా వేలాది దరఖాస్తులు పరిష్కరించకపోవడం మునిసిపల్ శాఖ పనితీరుకు అద్దం పడుతోందనుకోక తప్పదు. ఒకవేళ మునిసిపల్ శాఖ వద్ద ఒక్క దరఖాస్తు కూడా పెండింగులో లేనట్లయితే, 2015లో అంటే 5 ఏళ్ళ క్రితం దరఖాస్తు చేసుకొన్నవారు మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోనవసరం లేదని ఇప్పుడు చెప్పేవారు కాదు కదా?