నేడు తెలంగాణ శాసనసభ సమావేశం

ఇవాళ్ళ ఒక్కరోజే తెలంగాణ శాసనసభ సమావేశం జరుగనుంది. జీహెచ్‌ఎంసీతో సహా మరో నాలుగు చట్ట సవరణల కోసం ప్రభుత్వం ఇవాళ్ళ ప్రత్యేకంగా శాసనసభ సమావేశం నిర్వహిస్తోంది.  ఉదయం 11 గంటల నుంచి శాసనసభ సమావేశం మొదలవుతుంది. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, సీఆర్‌పీసీ, వ్యవసాయ భూములను ఇతర అవసరాల కోసం వినియోగించుకొనేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాలలో కొన్ని సవరణలు చేయబోతున్నారు. వీటి కోసమే ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తునందున ఇవాళ్ళ ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉండదు. గత శాసనసభ సమావేశాలలో పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు, విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కరోనా బారిన పడినందున ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నారు. 

ఇవాళ్ళ శాసనసభ ఆమోదించిన చట్టసవరణలపై చర్చించి ఆమోదించేందుకు రేపు శాసనమండలి సమావేశమవుతుంది. రేపటి శాసనమండలి సమావేశంలో నిజామాబాద్‌ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆమె తొలిసారిగా రేపు శాసనమండలిలో అడుగుపెడుతున్నారు.