బిజెపిలోకి ఖుష్బూ జంప్

ప్రముఖ నటి, తమిళనాడు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ఖుష్బూ ఇవాళ్ళ పార్టీకి గుడ్-బై చెప్పేసి బిజెపిలో చేరిపోయారు. ఆమె తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపిన తరువాత న్యూఢిల్లీ చేరుకొని అక్కడ తమిళనాడు బిజెపి అధ్యక్షుడు ఎల్.మురుగన్, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటి రవిల సమక్షంలో బిజెపిలో చేరారు. 

సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్న ఖుష్బూ మొదట డీఎంకె పార్టీ ద్వారా ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించారు. ఆ తరువాత 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఆమె తమిళనాడు కాంగ్రెస్‌ పార్టీకి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఆమె పోటీ చేయాలని ఆశపడ్డారు కానీ ఆమె కోరుకొన్న స్థానాన్ని పొత్తులలో భాగంగా డీఎంకేకు కేటాయించవలసి వచ్చింది. ఆ తరువాత ఆమెకు రాజ్యసభ సీటు ఇస్తామని బిజెపి హామీ ఇచ్చింది కానీ ఇంతవరకు ఇవ్వకపోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 

ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానాన్ని మెచ్చుకొంటూ ఆమె ఓ ట్వీట్ చేయడం ద్వారా తాను బిజెపిలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సంకేతం పంపించారు. ఆ పార్టీ రాష్ట్ర నేతలు వెంటనే స్పందించి ఆమెతో మాట్లాడి బిజెపిలోకి ఆహ్వానించారు. ఆమె బిజెపిలో చేరబోతున్నట్లు మీడియాలో ఊహాగానాలు వినిపిస్తుండటంతో కాంగ్రెస్‌ అధిష్టానం ఆమెను అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగించింది. దాంతో మరింత ఆగ్రహం చెందిన ఖుష్బూ ఇవాళ్ళ బిజెపిలో చేరిపోయారు.