శాసనసభ, మండలి సమావేశాల షెడ్యూల్ ఖరారు

జీహెచ్‌ఎంసీ చట్టంలో కొన్ని సవరణలు చేసేందుకుగాను వచ్చే మంగళవారం శాసనసభ, బుదవారం శాసనమండలి సమావేశాలు జరుగనున్నాయి. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు శాసనసభ సమావేశమయ్యి జీహెచ్‌ఎంసీ చట్టసవరణ బిల్లుతో పాటు మరికొన్ని ముఖ్యాంశాలపై చర్చించి ఆమోదిస్తుంది. మర్నాడు 11 గంటలకు శాసనమండలి సమావేశమై వాటిపై చర్చించి ఆమోదం తెలుపుతుంది. ఆ తరువాత శాసనసభ, మండలి సమావేశాలు నిరవధికంగా వాయిదా పడతాయి. ఇవాళ్ళ సాయంత్రం సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మంత్రివర్గసమావేశం జరుగనుంది. దానిలో శాసనసభలో ప్రవేశపెట్టవలసిన బిల్లులు, ఇతర అంశాల గురించి చర్చిస్తారు. కరోనా నేపధ్యంలో శాసనసభ, మండలి సమావేశాలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులు, విధులు నిర్వహించే సిబ్బంది, పోలీసులకు కరోనా సోకకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు, భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.