దుబ్బాక ఉపఎన్నికలకు నేటి నుంచి నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. దుబ్బాకలోని ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్లను దాఖలుచేయవలసి ఉంటుంది. నేటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు ప్రతీరోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేయవచ్చని రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న ఆర్వో చెన్నయ్య చెప్పారు. కరోనా కరణంగా నామినేషన్ వేసే అభ్యర్ధితో పాటు కేవలం ఇద్దరినీ మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తామని, వారు కూడా తప్పనిసరిగా మాస్కూలు ధరించి రావలసి ఉంటుందని తెలిపారు. కార్యాలయం ఆవరణలో ప్రవేశద్వారం వద్ద శానిటైజర్‌ను అందుబాటులో ఉంచామని చెప్పారు. కేంద్ర ఎన్నికల కమీషన్ సూచించిన మార్గదర్శకాల ప్రకారమే దుబ్బాక ఉపఎన్నికలు నిర్వహిస్తామని కనుక అభ్యర్ధులు కూడా అందుకు అనుగుణంగానే ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవాలని చెప్పారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నియోజకవర్గంలో ఎటువంటి మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎటువంటి అధికారిక కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు.
దుబ్బాక ఉపఎన్నికలలో టిఆర్ఎస్ తరపున మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత, కాంగ్రెస్ తరపున చెరుకు శ్రీనివాస్ రెడ్డి, బిజెపి అభ్యర్ధిగా రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు.
దుబ్బాక ఉపఎన్నికల షెడ్యూల్ :
నామినేషన్ల దాఖలు ప్రారంభం: అక్టోబర్ 9
నామినేషన్ల చివరి తేదీ : అక్టోబర్ 16
నామినేషన్ల పరిశీలన : అక్టోబర్ 17
ఉపసంహరణ చివరి తేదీ: అక్టోబర్ 19
పోలింగ్ తేదీ : నవంబర్ 3
కౌంటింగ్, ఫలితాలు వెల్లడి: నవంబర్ 10