
నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఇవాళ్ళ ఉదయం 9 గంటల నుంచి పోలింగ్ మొదలైంది. టిఆర్ఎస్ అభ్యర్ధిగా కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నుంచి వి. సుభాష్ రెడ్డి, బిజెపి నుంచి పోతనకర్ లక్ష్మినారాయణ ఈ స్థానానికి పోటీ చేస్తున్నారు.
స్థానిక సంస్థలలో టిఆర్ఎస్కే పూర్తి మెజార్టీ ఉన్నందున కల్వకుంట్ల కవిత నామినేషన్ వేసినరోజునే గెలుపు ఖరారైంది. కానీ కాంగ్రెస్, బిజెపిలకు తమ అభ్యర్ధిని గెలిపించుకొనేంత బలం లేనప్పటికీ పోటీకి దిగాయి కనుక ఎన్నికలు అనివార్యమయ్యాయి. కనుక ఇవాళ్ళ జరుగుతున్న పోలింగ్ కేవలం లాంఛనప్రాయమేనని భావించవచ్చు.
ఇప్పటికే టిఆర్ఎస్ అభ్యర్ధి కల్వకుంట్ల కవితతో సహా ఓటు హక్కు కలిగిన స్థానిక సంస్థల ప్రతినిధులందరూ పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కు వినియోగించుకొంటున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని స్థానిక సంస్థలలో మొత్తం 824 మంది ఓటు హక్కు కలిగిన సభ్యులు ఉండగా వారిలో 494 మంది టిఆర్ఎస్కు చెందినవారే ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్, బిజెపిల నుంచి టిఆర్ఎస్లోకి ఫిరాయించినవారు, స్వతంత్ర సభ్యులు, మజ్లీస్ సభ్యులు అందరితో కలిపి టిఆర్ఎస్ బలం 694కి చేరినట్లు సమాచారం. కనుక కల్వకుంట్ల కవిత గెలుపు లాంఛనప్రాయమే. అక్టోబర్ 12వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తుంది.