
నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఒక్క ఎమ్మెల్సీ స్థానానికి రేపు లాంఛనంగా ఎన్నికలు జరుగబోతున్నాయి. లాంఛనంగా ఎందుకంటే, స్థానిక సంస్థలలో మొత్తం 824 మంది ఓటర్లు ఉండగా వారిలో 494 మంది టిఆర్ఎస్‌కు చెందినవారే ఉన్నారు కనుక టిఆర్ఎస్ అభ్యర్ధిగా కవిత నామినేషన్ వేసినప్పుడే ఆమె గెలుపు ఖరారు అయిపోయింది. కానీ కాంగ్రెస్, బిజెపిలకు తగినంత బలం లేనప్పటికీ తమ అభ్యర్ధులను కూడా బరిలో దింపడం చేత ఎన్నికలు అనివార్యం అయ్యాయి. లేకుంటే నామినేషన్ వేసిన రోజునే కవిత ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించి ఉండేది. బహుశః కవిత ఎమ్మెల్సీగా ఎన్నిక అవకుండా కొన్నివారాలైన అడ్డుకోవాలనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్, బిజెపిలు నామినేషన్స్ వేసి ఉండవచ్చు. కరోనా కారణంగా అవి ఊహించినదాని కంటే చాలా ఎక్కువ కాలమే (6 నెలలు) ఈ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి కాంగ్రెస్, బిజెపిలలో నుంచి భారీగా ఫిరాయింపులు జరుగడంతో టిఆర్ఎస్ బలం ఇప్పుడు సుమారు 694కి చేరింది. రేపు ఎన్నికల ప్రక్రియ ముగిస్తే కవిత ఎమ్మెల్సీగా ఎన్నికైపోయినట్లే. కానీ అక్టోబర్ 12న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించేవరకు ఆగవలసి ఉంటుంది.