
ఇటీవల మునిసిపల్ శాఖా మంత్రి కేటీఆర్ పార్టీ నేతలతో మాట్లాడుతూ నవంబర్ 2వ వారంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కనుక అందరూ సిద్దం కావాలని పిలుపు ఇచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఎన్నికల సంఘం చెప్పవలసిన విషయాన్ని ముందుగానే మంత్రి కేటీఆర్ ప్రకటించడంపై పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది. టిఆర్ఎస్ ఓటమి భయంతోనే జీహెచ్ఎంసీ ఎన్నికలను ముందుగా జరిపించేందుకు తెర వెనుక సన్నాహాలు చేస్తోందంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి.
వాటిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, “నేను నవంబర్ 2వ వారంలోగా జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ రావచ్చని చెపితే మీడియా దానిని తప్పుగా అర్ధం చేసుకొని నవంబర్ 2వ వారంలో ఎన్నికలు జరుగుతాయని నేను చెప్పినట్లు ప్రచురించాయి. వాటిని నేను ఖండిస్తున్నాను,” అని అన్నారు.
అయితే రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పార్ధసారధి ఇవాళ్ళ తిరుమల శ్రీవారిని దర్శించుకొన్నప్పుడు అక్కడ మీడియాతో మాట్లాడుతూ, “త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటిస్తాము. నవంబర్-డిసెంబర్లోగా జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయి,” అని చెప్పారు. అంటే నవంబర్ రెండో వారంలో ఎన్నికలు జరుగవచ్చని మంత్రి కేటీఆర్ చెప్పింది నిజమేనని భావించవచ్చు. జనవరి- ఫిబ్రవరిలో జరుగవలసిన జీహెచ్ఎంసీ ఎన్నికలు ఒకవేళ నవంబర్-డిసెంబర్లో జరిగేమాటయితే వాటికి సిద్దం అయ్యేందుకు ప్రతిపక్షాలకు తగినంత సమయం ఉండదు కనుక హడావుడిగా అభ్యర్ధులను ఖరారు చేసుకొని సిద్దం కావలసి ఉంటుంది. కానీ టిఆర్ఎస్కు ఈవిషయం ముందే తెలుసు కనుక అన్ని ఏర్పాట్లు చేసుకొని చాలా సులువుగా ఎన్నికలలో పైచేయి సాధించగలదు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించక మునుపే ఆ వివరాలు అధికార పార్టీకి ఏవిధంగా తెలుస్తున్నాయి? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.