అపెక్స్ కౌన్సిల్‌ సమావేశం ఫలవంతం: కేంద్రమంత్రి

రెండు తెలుగు రాష్ట్రాల మద్య నెలకొన్న జలవివాదాలపై చర్చించేందుకు నేడు అపెక్స్ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌లతో సహా కృష్ణా, గోదావరీ బోర్డు చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇరువురు ముఖ్యమంత్రుల మద్య కాసేపు వాగ్వాదం జరిగినట్లు సమాచారం. అయితే సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ కలుగజేసుకొని వారిని శాంతింపజేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం చాలా అర్ధవంతంగా సాగిందని మంత్రి గజేంద్రసింగ్ చెప్పారు. ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై సిఎం కేసీఆర్‌ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు, ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి స్పందిస్తూ తెలంగాణలో ఎన్ని ప్రాజెక్టులకు డీపీఆర్‌లు, అనుమతులున్నాయని ఎదురు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తన ఇష్టం వచ్చినట్లు సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకొని నీళ్ళు మళ్లించుకొంటోందని ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి సమావేశంలో కుండబద్దలు కొట్టినట్లు చెప్పినట్లు తెలుస్తోంది.        

కృష్ణా బోర్డును విజయవాడకు తరలించే ప్రతిపాదనకు సిఎం కేసీఆర్‌ అంగీకారం తెలుపగా, గోదావరి బోర్డును హైదరాబాద్‌లోనే కొనసాగించేందుకు ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి అంగీకరించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కొత్తగా నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులకు సంబందించి డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు)లను కేంద్రానికి అందించాలనే ప్రతిపాదనకు ఇరువురు ముఖ్యమంత్రులు అంగీకరించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో సాగునీటి ప్రాజెక్టులను అనుమతించే అధికారం అపెక్స్ కౌన్సిల్‌కు ఉందని చెప్పారు. ట్రిబ్యూనల్ ద్వారా తెలంగాణకు నీటిని కేటాయించాలనే సిఎం కేసీఆర్‌ అభ్యర్ధనపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ స్పందిస్తూ ముందు సుప్రీంకోర్టులో వేసిన కేసులను ఉపసంహరించుకోవాలని సూచించారు. ఆ తరువాత న్యాయపరమైన అంశాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకొంటామని చెప్పారు. అందుకు సిఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారని మంత్రి గజేంద్రసింగ్ చెప్పారు. నదీజలాల పంపకాలపై రెండు రాష్ట్రాలు తమ ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించినట్లయితే వాటిని ట్రిబ్యునల్‌కు పంపిస్తామని చెప్పారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని కేవలం కేంద్రప్రభుత్వం మాత్రమే నిర్ణయించగలదని మంత్రి గజేంద్రసింగ్ స్పష్టం చేశారు.