
తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసి మరోసారి తన అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. ఆయన వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వర్ రావు చెప్పారు.
నిన్న సాయంత్రం నాంపల్లిలోని పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ, “టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు పూర్తి భిన్నంగా పాలన సాగిస్తోంది. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితే నిరుద్యోగ సమస్య తీరిపోతుందని భావిస్తే ఈ ఆరేళ్ళలోనే రాష్ట్రంలో సుమారు 30 లక్షల మందికిపైగా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూపులు చూస్తూ భారంగా జీవితాలు గడుపుతున్నారు. రాష్ట్రంలో వివిద ప్రభుత్వ శాఖలలో సుమారు లక్షన్నర ఉద్యోగాలు ఖాళీ ఉంటే ఈ ఆరేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం 29,000 ప్రభుత్వోద్యోగాలను మాత్రమే భర్తీ చేసింది. తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రంలో నిరంకుశపాలన సాగుతోంది. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు కంటే ఇప్పుడే భావప్రకటన స్వేచ్చ, స్వాతంత్ర్యం కోల్పోయాము. ప్రజల గొంతు వినిపించాలనుకొనేవారిని గృహనిర్బందాలు చేస్తూ పోలీసులతో వేధింపులకు పాల్పడుతూ అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కనుక ప్రజల గొంతును శాసనమండలిలో బలంగా వినిపించాలంటే ప్రొఫెసర్ కోదండరాంను గెలిపించాలి,” అని అన్నారు. ఇతర పార్టీల మద్దతు కోరామని వాటిలో కొన్ని సానుకూలంగా స్పందించాయని పీఎల్ విశ్వేశ్వర్ రావు చెప్పారు.
తెలంగాణ ఏర్పడితే ఒకేసారి లక్షన్నర ప్రభుత్వోద్యోగాలను భర్తీ చేసుకోవచ్చునని ఉద్యమ సమయంలో టిఆర్ఎస్ వాదించింది. కానీ తెలంగాణ ఏర్పడి టిఆర్ఎస్సే అధికారంలోకి వచ్చి ఆరేళ్ళు గడిచిపోయినా లక్షన్నర ఉద్యోగాలను భర్తీ చేయలేదు.
ఈ ఎన్నికలలో కేవలం పట్టభద్రులు మాత్రమే పాల్గొంటారు కనుక నిరుద్యోగ సమస్యలు, ప్రభుత్వోద్యోగాల భర్తీయే ప్రధాన అంశాలుగా నిలిచే అవకాశం ఉంది. ఆ సమస్యలపై ప్రొఫెసర్ కోదండరాం తన వాదనలతో ఓటర్లను ఆకట్టుకోగలరు. ఇంకా వామపక్షాలు, కాంగ్రెస్, బిజెపిలు కూడా తమ అభ్యర్ధులను బరిలో దింపబోతున్నాయి. కనుక ఎమ్మెల్సీ ఎన్నికలలో అన్ని పార్టీలు విడివిడిగా పోటీ చేస్తున్నప్పటికీ అన్ని పార్టీలు ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ సమస్యల గురించి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడం ఖాయం. కనుక ఆ మూడు జిల్లాలలో నిరుద్యోగులుగా ఉన్న పట్టభద్రులను టిఆర్ఎస్ ఏవిధంగా ప్రసన్నం చేసుకొంటుందో చూడాలి.