మంత్రుల ఎదుటే టిఆర్ఎస్‌ నేతలు ఫైటింగ్

హోంమంత్రి మహమూద్ ఆలీ సమక్షంలోనే నిన్న టిఆర్ఎస్‌ నేతలు ఒకరినొకరు కొట్టుకొన్నారు. పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల గురించి చర్చించేందుకు మంత్రులు మహమూద్ ఆలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌, ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు అధ్వర్యంలో నిన్న ఘోషామహల్ నియోజకవర్గం టిఆర్ఎస్‌ నేతలతో రాంకోఠిలోని రూబీ గార్డెన్స్ లో సన్నాహక సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభమైన తరువాత స్థానిక నేతలను ఒకరొకరిని వేదికపైకి ఆహ్వానించినప్పుడు స్థానిక సీనియర్ నేత ఆర్‌వీ మహేందర్ కుమార్‌ను పిలువకపోవడంతో ఆయన లేచి నిలబడి ‘నన్ను ఎందుకు పిలవలేదు?’ అంటూ ఆగ్రహంగా ప్రశ్నించారు. వేదికపై ఉన్నవారు ఆయనకు సర్దిచెప్పబోతుంటే, జాంబాగ్ డివిజన్‌కు చెందిన టిఆర్ఎస్‌ నేత జయశంకర్ మహేందర్ కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో వారిరువురి మద్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగి, అది ఇరువర్గాలు ఒకరినికరు కొట్టుకొనేంతవరకు వెళ్లింది. చివరికి పోలీసులు వచ్చి కలుగజేసుకొని పరిస్థితిని అదుపులో తెచ్చేక సమావేశం కొనసాగింది. సమావేశం ముగించుకొని మంత్రులు వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ ఇరువర్గాలు కొట్టుకొన్నారు. మళ్ళీ పోలీసులు కలుగజేసుకొని వారిని అక్కడి నుంచి పంపించివేశారు. ఆ తరువాత రెండువర్గాలకు చెందిన నేతలు నారాయణగూడా పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళి ఒకరిపై మరొకరు పిర్యాదులు చేసుకొన్నారు.