దుబ్బాక కాంగ్రెస్‌ అభ్యర్ధి ఖరారు

దుబ్బాక ఉపఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి పేరును ఖరారు చేసింది. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌-ఛార్జ్ మానిక్కం ఠాగూర్, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు రేవంత్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఇంకా పలువురు సీనియర్ కాంగ్రెస్‌ నేతలు, మెదక్ జిల్లా నేతలు ఆదివారం హైదరాబాద్‌లో హరితప్లాజాలో సమావేశమయ్యి దుబ్బాక ఉపఎన్నికలకు అభ్యర్ధి ఎంపికపై చాలాసేపు చర్చించారు. దుబ్బాక నుంచి శ్రవణ్ కుమార్ రెడ్డి, వెంకట నర్సింహా రెడ్డి కూడా పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. కానీ చివరికి నర్సారెడ్డి పేరును ఖరారు చేసారు. ఆయన అభ్యర్ధిత్వాన్ని కాంగ్రెస్‌ అధిష్టానం ఆమోదించగానే అధికారికంగా ప్రకటిస్తారు. అయితే నర్సారెడ్డి పేరును మాత్రమే రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రతిపాదించినందున ఆయన పేరు ఖరారు అయిపోయినట్లే.

టిఆర్ఎస్‌ తరపున మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ సోలిపేట రామలింగారెడ్డి భార్యను అభ్యర్ధిగా ప్రకటించాలని టిఆర్ఎస్‌ అధిష్టానం భావిస్తున్నప్పటికీ, ఇప్పుడు వేరే పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

బిజెపి తరపున ఆ పార్టీ సీనియర్ నేత రఘునందన్ రావు పేరు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన దుబ్బాకలో జోరుగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. 

కాంగ్రెస్ అభ్యర్ధిగా నర్సారెడ్డి పేరు ఖరారు అయ్యింది. కనుక టిఆర్ఎస్‌, బిజెపిలు కూడా తమా అభ్యర్ధులను అధికారికంగా ప్రకటిస్తే ముగ్గురు అభ్యర్ధుల మద్య ప్రత్యక్షయుద్ధం ప్రారంభం అయిపోతుంది.   

దుబ్బాక ఉపఎన్నికల షెడ్యూల్: 

నామినేషన్ల దాఖలు ప్రారంభం: అక్టోబర్ 9 

నామినేషన్ల చివరి తేదీ : అక్టోబర్ 16

నామినేషన్ల పరిశీలన : అక్టోబర్ 17 

ఉపసంహరణ చివరి తేదీ:  అక్టోబర్ 19 

పోలింగ్ తేదీ : నవంబర్ 3 

కౌంటింగ్ తేదీ నవంబర్:  10