
బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై ఈరోజు సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పును బిజెపి నేతలందరూ స్వాగతించారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ స్పందిస్తూ, “గత రెండున్నర దశాబ్ధాలుగా ఈ వంకతో గౌరవనీయులైన మా బిజెపి అగ్రనేతలపై కొందరు పనికట్టుకొని దుష్ప్రచారం చేస్తూ వారి ప్రతిష్టకు భంగం కలిగించారు. కానీ మా అగ్రనేతలు రాజ్యాంగం, న్యాయవ్యవస్థపై గౌరవంతో ఇంతకాలం ఓపికగా న్యాయం కోసం వేచిచూశారు. చివరికి సిబిఐ కోర్టు తన చారిత్రాత్మకమైన తీర్పుతో వాస్తవాలను లోకం ముందుకు తెచ్చి న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడింది.
మా పార్టీని, మా అగ్రనేతలను అప్రదిష్టపాలు చేయాలనే రాజకీయ దురుదేశ్యంతోనే కొందరు ఈ కేసు నడిపించారు తప్ప బాబ్రీ కూల్చివేతలో ఎటువంటి కుట్ర లేదని న్యాయస్థానం తీర్పుతో స్పష్టమైంది. అందుకు ఈ కేసులో వాదించిన న్యాయవాదులు, ఇతరులు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని అన్నారు.