
స్వచ్ఛ భారత్లో తెలంగాణ రాష్ట్రం మళ్ళీ మొదటి స్థానం సంపాదించుకొంది. దీంతో వరుసగా మూడవసారి మొదటిస్థానం సాధించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. రాష్ట్రాల స్థాయిలో తెలంగాణ మొదటి స్థానంలో నిలువగా, జిల్లాల స్థాయిలో కరీంనగర్ 3వ స్థానంలో నిలిచింది. పారిశుద్యం, తాగునీరు విభాగాలలో దేశంలో తెలంగాణకు మొదటి స్థానం లభించిందని తెలియజేస్తూ కేంద్ర పారిశుధ్య, తాగునీరు విభాగం డైరెక్టర్ కిషోర్ జోషి ఓ లేఖ ద్వారా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు తెలియజేశారు. అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ దివస్ రోజున కేంద్రజలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆన్లైన్ ద్వారా ఈ అవార్డులను అందజేస్తారని తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా వాటిని అందుకొనున్నారు.
తెలంగాణలో పల్లెలు కూడా పరిశుభ్రంగా, పచ్చదనంతో కళకళలాడుతుండాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా 10-15 రోజులు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. మిషన్ భగీరధ పధకం ద్వారా అందరికీ సురక్షితమైన తాగునీటిని కూడా అందిస్తోంది. కనుక ఈ అవార్డును అందుకోవడానికి తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలా అర్హమైనదేనని భావించవచ్చు.