ఎమ్మెల్సీ ఎన్నికలకు బరిలో వామపక్షాలు?

తెలంగాణలో జరుగనున్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సిపిఐ, సిపిఎం పార్టీలు కలిసి పోటీ చేయాలని యోచిస్తున్నాయి. హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం స్థానానికి సిపిఎం అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల స్థానానికి సిపిఐ అభ్యర్ధిగా మహబూబాబాద్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ జయసారధి రెడ్డిని బరిలో దించుదామని వామపక్షాలు భావిస్తున్నాయి. వారిరువురూ ఆయా జిల్లాల ప్రజలకు చిరపరిచితులు, రాజకీయ నేపధ్యం కూడా కలిగి ఉన్నందున వారిని బరిలో దించినట్లయితే టిఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బిజెపిలకు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా, వాటి ఓట్లు చీల్చి గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఈ నెల 30న ఓసారి సమావేశమయ్యి కలిసి పోటీ చేయడంపై తుది నిర్ణయం తీసుకోవాలని రెండు పార్టీలు నిర్ణయించాయి.