అక్టోబర్ 9న నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక

నిజామాబాద్‌ స్థానికసంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఎన్నికల సంఘం శుక్రవారం షెడ్యూల్ ప్రకటించింది. అక్టోబర్ 9న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అక్టోబర్ 12న ఓట్లు లెక్కించి అదేరోజున ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఉపఎన్నిక ఏప్రిల్ 7నే జరుగవలసి ఉంది కానీ లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. టిఆర్ఎస్‌ తరపున మాజీ ఎంపీ కవిత నామినేషన్ వేశారు. స్థానికసంస్థలలో టిఆర్ఎస్‌కే బలం ఉన్నందున ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ అభ్యర్ధి కవిత ఎన్నిక లాంఛనప్రాయమేనని చెప్పవచ్చు. టిఆర్ఎస్‌ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికైన భూపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించడంతో ఆయనపై అనర్హత వేటు పడింది. దాంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. దానికే ఇప్పుడు ఉపఎన్నిక జరుగబోతోంది. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కవిత నిజామాబాద్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటి నుంచి రాజకీయాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నికైతే మళ్ళీ రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించవచ్చు. .