ఎన్నికల సంఘానికి టిఆర్ఎస్‌ విజ్ఞప్తి!

రాష్ట్ర ఎన్నికల సంఘానికి టిఆర్ఎస్‌ విజ్ఞప్తి చేసింది! ఇంతకీ ఆ విజ్ఞప్తి ఏమిటంటే...జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్లతో నిర్వహించాలని కోరింది. టిఆర్ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎం.శ్రీనివాస్ రెడ్డి, భరత్ కుమార్‌లు గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిణి కలిసి టిఆర్ఎస్‌ తరపున వినతిపత్రం అందజేశారు. కరోనా నేపధ్యంలో ఓటర్లు ఈవీఎంలను ఉపయోగించడం కంటే బ్యాలెట్ పేపర్లతో ఓటింగ్ చేయడమే క్షేమమని భావిస్తున్నామని అందుకే ఈసారి వాటితో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు, సిఎం కేసీఆర్‌తో ఈ విషయంపై చర్చించిన తరువాత ఆయన అనుమతితోనే ఈ విజ్ఞప్తి చేస్తున్నామని, కనుక దీనిని టిఆర్ఎస్‌ పార్టీ అభిప్రాయంగానే  పరిగణించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.