టిఆర్ఎస్‌ సభ్యత్వానికి రాజీనామా

సికింద్రాబాద్‌లో కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు జె.రామకృష్ణ టిఆర్ఎస్‌ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం ఉదయం మహేంద్రాహిల్స్‌లోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటుచేసి ఈవిషయం స్వయంగా ప్రకటించారు. స్థానిక టిఆర్ఎస్‌ నేతలతో భేధాభిప్రాయాల కారణంగానే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్ష పదవిలో కొనసాగుతానని చెప్పారు. ఇంతకాలం తన రాజకీయ ఎదుగుదలకు సహాయసహకారాలు అందించి మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్ యాదవ్, డెప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌లకు, కంటోన్మెంట్ బోర్డులో సహకరించిన పలువురు సభ్యులకు ఈ సందర్భంగా రామకృష్ణ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. తన సహచరులతో సంప్రదించి త్వరలోనే భవిష్య కార్యాచరణ నిర్ణయించుకొంటానని చెప్పారు. 

ఈ సమస్య గురించి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఇదివరకే తెలుసు. కనుక కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్ష పదవి నుంచి రామకృష్ణ తప్పుకోగానే ఆయన స్థానంలో 1వ వార్డు సభ్యుడు జక్కుల మహేశ్వర్ రెడ్డిని ఎన్నుకొంటారని కొన్ని రోజుల క్రితమే చెప్పారు. కానీ రామకృష్ణ టిఆర్ఎస్‌ పార్టీకి గుడ్ బై చెప్పేసి ఉపాధ్యక్ష పదవిలో కొనసాగాలనుకోవడంతో టిఆర్ఎస్‌కు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవలసివస్తోంది. రామకృష్ణ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన తరువాత కొంతమంది నేతలతో కలిసి కొన్ని వార్డులలో పర్యటించి స్థానిక పెద్దలను కలిశారు. దాంతో ఆయన స్థానిక టిఆర్ఎస్‌ నేతలతో రాజకీయ యుద్ధానికి కూడా సిద్దం అవుతున్నట్లు స్పష్టమైంది.