
అన్ని మెట్రో నగరాలకు ఎదురయ్యే సమస్యలే హైదరాబాద్ నగరానికి కూడా ఎదురవుతున్నాయి. మత్తుమందులు, హవాలా, రియల్ ఎస్టేట్ హత్యలు, కిడ్నాపులు, అత్యాచారాలు వంటివాటి గురించి తరచూ వార్తలలో వినిపిస్తునే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న ఓ భారీ హవాలా రాకెట్‌ను వెస్ట్ జోన్ పోలీసులు ఛేదించారు. నగరంలో భారీ ఎత్తున హవాలా లావాదేవీలు జరుగుతున్నాయని గుర్తించిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ గత కొన్ని రోజులుగా అనుమానితులపై నిఘా పెట్టింది. చివరికి దానిని నడిపిస్తున్న ఓ పెద్ద ముఠాను పట్టుకొని, వారి నుంచి ఏకంగా రూ.3,75,30,000 స్వాధీనం చేసుకొంది. వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి.రాధాకిషన్ రావు నేతృతంలో రెండు బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.
మంగళవారం బషీర్‌బాగ్ పోలీస్ కమీషనర్ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు హాజరుపరిచారు. పి.రాధాకిషన్ రావు, ఇన్‌స్పెక్టర్ గట్టు మల్లుతో కలిసి సీపీ అంజనీకుమార్ మీడియాకు హవాలా రాకెట్ గురించి మీడియాకు వివరించారు.
గుజరాత్‌కు చెందిన హరీష్‌రామ్‌భాయ్ పటేల్, అజిత్ సింగ్ ఆర్.దోడియా, సోలంకి ఈశ్వర్ దిలీప్, రాథోడ్ కనక్‌సింగ్ నతుబాలు నగరంలోని బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 12లో ఆనంద్ బంజారా కాలానీలో ‘పి.విజయ్ అండ్ కంపెనీ’లో పనిచేస్తున్నారు. వారిలో హరీష్ రామ్, ఈశ్వర్ డ్రైవర్లు కాగా, అజిత్ సింగ్ ఆర్.దోడియా, రాథోడ్ కనక్ సింగ్‌లు ఆఫీస్ బాయ్‌లుగా పనిచేస్తున్నారని తెలిపారు.
వారు హైదరాబాద్ నుంచి రూ.3.75 కోట్లు కారులో ముంబైకి తరలిస్తుండగా సమాచారం అందుకొన్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారిని సినిమా ఫక్కీలో వెంటాడి పట్టుకొన్నారు. నిందితులను అరెస్ట్ చేసి, వారు సొమ్మును తరలిస్తున్న రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకొన్న డబ్బును ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించారు. నగరంలో ఇంత బారీ స్థాయిలో హవాలా లావాదేవీలు జరుగుతున్నాయని ఇప్పుడే బయటపడటంతో ఇంకా దీని వెనుక ఎంతమంది పెద్దలున్నారో అనే అనుమానాలు మొదలయ్యాయి.