తెలంగాణ బి-పాస్ బిల్లులో ముఖ్యాంశాలు

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని వివిద ప్రభుత్వ శాఖలలో వ్యవస్థలలో సంస్కరణలు చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో భాగంగా రాష్ట్ర మునిసిపల్ విభాగంలో భవన నిర్మాణ అనుమతులు, ఆమోద విధానాలలో అనేకమార్పులు చేర్పులు చేసి ‘టిఎస్ బిపాస్’ అనే బిల్లుకు సోమవారం శాసనసభలో ఆమోదముద్ర వేసింది. దానిపై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా మునిసిపల్ మంత్రి కేటీఆర్‌ ఆ బిల్లు గురించి సభ్యులకు వివరిస్తూ,“సామాన్య ప్రజలు మొదలు రియల్ ఎస్టేట్ వ్యాపారుల వరకు అందరికీ అత్యుత్తమైన, చురుకైన, అవినీతిరహితమైన సేవలు అందించాలనే ఉద్దేశ్యంతోనే ఈ టిఎస్ బిపాస్ అనే నూతన విధానాన్ని ప్రవేశపెడుతున్నాము. త్వరలోనే అమలులోకి రాబోతున్న ఈ టిఎస్ బిపాస్ విధానంలో ముఖ్యాంశాలు: 

• రాష్ట్రంలో 75 గజాలు అంతకంటే తక్కువ స్థలంలో ఇళ్ళు నిర్మించుకొనేవారు ఎటువంటి అనుమతులకు దరఖాస్తు చేసుకోనవసరం లేదు. కేవలం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకొంటే చాలు రాజముద్రతో సంబందిత పత్రం జారీ అవుతుంది. 

• 75 నుంచి 600 గజాలలోపు ఇళ్ళకు, లే అవుట్‌లకు ఆన్‌లైన్‌లో స్వీయ దృవీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అవన్నీ సరిగ్గా ఉన్నట్లయితే 21 రోజులలో అనుమతి లభిస్తుంది. ఒకవేళ వాటిలో ఏవైనా లోపాలున్నట్లయితే 21 రోజులలోపే సంబందిత అధికారులు ఆవిషయం తెలియజేస్తారు. ఒకవేళ అధికారుల నుంచి ఎటువంటి సమాచారం రానట్లయితే 22వ రోజున అనుమతి లభించినట్లే భావించవచ్చు. ఆ మేరకు దరఖాస్తుదారునికి రాజముద్రతో కూడిన ఓ లేఖ (డీమ్డ్ టు బి అప్రూవ్డ్) ఆన్‌లైన్‌లో పంపించబడుతుంది. దరఖాస్తులో పేర్కొన్న వివరాలన్నీ సక్రమంగా ఉన్నట్లయితే 21 రోజులలో అనుమతి రాకపోయినా అనుమతించినట్లే భావించి ఇంటి నిర్మాణం మొదలుపెట్టుకోవచ్చు. ఒకవేళ దరఖాస్తులో తప్పుడు వివరాలు ఇచ్చి, అనుమతి రాకుండా ఇంటి నిర్మాణం చేపట్టినట్లయితే, వాటిని అక్రమకట్టడంగా భావించి ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తారు.  

•  కేవలం 15 రోజులలోనే ఆక్యుపెన్సీ లెటర్ జారీ చేయబడుతుంది. 

•   ఈ చట్టం అమలులో లోటుపాట్లను గుర్తించేందుకు, సక్రమంగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్ చైర్మన్లుగా పర్యవేక్షణ కమిటీ (మానిటరింగ్ సెల్)లు ఉంటాయి. 

• హైదరాబాద్‌లో కలెక్టర్‌కు బదులు జోనల్ కమీషనర్ల అధ్యవర్యంలో ఈ పర్యవేక్షణ కమిటీలు పనిచేస్తాయి. 

• రాష్ట్ర స్థాయిలో మునిసిపల్ శాఖ డైరెక్టర్లు, జీహెచ్‌ఎంసీ కమీషనర్ అధ్వర్యంలో ఓ ఛేజింగ్ సెల్ కూడా ఉంటుంది. 

• ఈ కమిటీలు, ఛేజింగ్ సెల్ టిఎస్ బిపాస్ చట్టం పటిష్టంగా, పారదర్శకంగా అమలుచేసేందుకు కృషి చేస్తుంటాయి.