యాదాద్రి అభివృద్ధి పనులకు మరో 75 కోట్లు మంజూరు

సిఎం కేసీఆర్‌ ఆదివారం మధ్యాహ్నం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేకపూజలు చేశారు.  అనంతరం ఆలయ ప్రాంగణమంతా తిరిగి అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆలయ అభివృధ్ది పనులకు మూడు వారాలలో రూ.75 కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుకు ఫోన్లో ఆదేశించారు. గండిచెరువును కాళేశ్వరం నీటితో నింపాలని, కొండ చుట్టూ మరిన్ని మొక్కలు నాటి పచ్చదనం పెంచాలని అధికారులకు సూచించారు. కొండ దిగువన పట్టణంలో భక్తుల కోసం ప్రస్తుతం నిర్మిస్తున్న 365 వసతి గృహాలకు అదనంగా మరో 200 ఎకరాలలో వసతిగృహాలు నిర్మించాలని ఆదేశించారు. ఆలయంలో ప్రధాన గోడలు, స్థంభాలకు బంగారు, వెండి రేకులను తాపడం చేసి తంజావూర్ ఆలయంతో పోటీ పడేవిధంగా అద్భుతంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఆలయ నిర్మాణపనులు వేగంగా పూర్తి చేయాలని కానీ ఎక్కడా నాణ్యతలో రాజీపడరాదని సూచించారు. సాయంత్రం 5.30 గంటలకు కారులో తిరుగుప్రయాణమైనప్పుడు కొండపై దారిలో కోతుల గుంపులను చూసి, సిఎం కేసీఆర్‌ కారు దిగి వాటికి స్వయంగా అరటిపళ్లు తినిపించారు. అనంతరం రోడ్డు మార్గాన్న కారులో ప్రగతి భవన్‌ చేరుకొన్నారు.