అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం

రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని కోరుతూ వందలాది బిజెపి కార్యకర్తలు ఇవాళ్ళ అసెంబ్లీని ముట్టడికి తరలిరావడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎటువంటి ముందస్తు ప్రకటన చేయకుండా నలువైపుల నుంచి బిజెపి కార్యకర్తలు శాసనసభ వైపు దూసుకువస్తుండటంతో వారిని అడ్డుకోవడానికి పోలీసులు చాలా శ్రమించవలసి వస్తోంది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌తో సహా పలువురు బిజెపి నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తుండగా బిజెపి కార్యకర్తలు రోడ్డుపై అడ్డుగా పడుకొని పోలీస్ వాహనాలను అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తుండటంతో, పోలీసులు వారిని కూడా అరెస్ట్ చేశారు. బిజెపి వ్యూహం అర్ధం చేసుకొన్న పోలీసులు అసెంబ్లీ పరిసర ప్రాంతాలలో ఒక కిలోమీటర్ పరిధిలో సెక్షన్ 144 విధించారు. మధ్యాహ్నం వరకు సుమారు 2-300 మంది బిజెపి కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరపాలని మేము కోరుతుంటే, సిఎం కేసీఆర్‌ నిజాం నవాబులను పొగుడుతూ వారికి గులాంలా వ్యవహరిస్తున్నారు. మజ్లీస్ పార్టీకి భయపడే సిఎం కేసీఆర్‌ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేయడం లేదని అర్ధమవుతూనే ఉంది. అయితే వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం తధ్యం. బిజెపి అధికారంలోకి రాగానే అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతాము,” అని అన్నారు.