కేంద్రంతో యుద్ధానికి సై: కే.కేశవరావు

ఈ నెల 14 నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలవనున్నందున సిఎం కేసీఆర్‌ నిన్న ప్రగతి భవన్‌లో టిఆర్ఎస్‌ ఎంపీలతో సమావేశమై పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రానికి సంబందించిన పలు అంశాలు, సమస్యలపై సిఎం కేసీఆర్‌ స్వయంగా ప్రధాని నరేంద్రమోడీని కలిసి అనేకసార్లు మాట్లాడారు. అనేక లేఖలు వ్రాశారు  కానీ కేంద్రం పట్టించుకోలేదు. యూరియా సరఫరా, జిఎస్టీ బకాయిల చెల్లింపు, రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం, రెండు తెలుగు రాష్ట్రాల మద్య కృష్ణానదీ జల వివాదాలు వంటి అనేక సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళినా పట్టించుకోవడం లేదు. పైగా విద్యుత్ సంస్కరణల పేరుతో రాష్ట్రాలకు కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. రైతులకు నష్టం కలిగించేలా వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించాలనే ప్రతిపాదనను మేము వ్యతిరేకిస్తున్నాం. కేంద్రప్రభుత్వం అసమర్దత, నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రాలు, ప్రజలు నష్టపోవలసివస్తోంది. కనుక రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ఈసారి పార్లమెంటు లోపల బయటా కూడా కేంద్రానికి నిరసనలు తెలియజేస్తాము. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం కేంద్రంతో కొట్లాడటానికి వెనకాడబోము. మాతో కలిసివచ్చే పార్టీలను కలుపుకొని కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ కాంగ్రెస్‌, బిజెపిలు మాతో కలిసి కేంద్రంతో కొట్లాడేందుకు రావాలని కోరుకొంటున్నాము,” అని చెప్పారు.