
రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా రోగుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తుండటంపై నిన్న శాసనసభ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంతో రాష్ట్ర ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. సిఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ బుదవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. దానిలో రాహుల్ బొజ్జా, సర్ఫరాజ్ అహ్మద్, డి.దివ్య ఉన్నారు.
ప్రభుత్వం సూచించిన విధంగా ప్రైవేట్ ఆసుపత్రులలో కరోనా జాగ్రత్తలు పాటిస్తున్నాయా లేదా? ఆసుపత్రులలో కరోనా చికిత్సకు తగిన వైద్యసౌకర్యాలు కల్పిస్తున్నాయా లేదా?ప్రభుత్వం సూచించిన దానికంటే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాయా? ప్రభుత్వ సూచనలు, ఆదేశాల ప్రకారం పనిచేస్తున్నాయా లేదా? వంటి అన్ని అంశాలను టాస్క్‌ఫోర్స్ పరిశీలిస్తుంటుంది. కరోనా చికిత్సకు అనుమతించిన ప్రైవేట్ ఆసుపత్రులను తరచూ పర్యటిస్తూ వాస్తవ పరిస్థితులను తెలుసుకొని ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి నివేదికలు సమర్పిస్తుంటుంది. ఆ నివేదికల ఆధారంగా ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకొంటుంది.