అంతా నేను చెప్పినట్లే జరుగుతోంది: కేసీఆర్‌

శాసనసభలో నిన్న కరోనా సంబంధిత అంశాలపై జరిగిన చర్చలో సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, “ప్రైవేట్ ఆసుపత్రులను కరోనా చికిత్సకు అనుమతిస్తే అవి ప్రజలను దోచుకొంటాయని నేను ముందే చెప్పాను. కానీ ప్రైవేట్ ఆసుపత్రులను అనుమతించాలని ఐసీఎంఆర్‌ ఆదేశించింది. ఆనాడు నేను చెప్పినట్లుగానే ఇప్పుడు జరుగుతోంది. ప్రైవేట్ ఆసుపత్రులు డబ్బు కోసం కరోనా రోగులను పీడిస్తున్నాయి. ఈ కష్టకాలంలో మానవతా దృక్పదంతో కరోనా రోగులకు వైద్య సేవలందించాలని నేను చేసిన విజ్ఞప్తిని కూడా పట్టించుకోకుండా రోగుల నుంచి భారీగా ఫీజు వసూలు చేస్తున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులు చివరికి శవాలపై కూడా డబ్బు సంపాదించాలనుకొంటున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి రోగుల నుంచి బలవంతంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రులపై కటినచర్యలు తీసుకొంటాము. తక్షణమే దీని కోసం ఓ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఓ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాము,” అని చెప్పారు. 

“కరోనా మహమ్మారి గురించి మొట్టమొదట కేంద్రాన్ని హెచ్చరించింది నేనే. విదేశాల నుంచి మన దేశంలోకి కరోనా ప్రవేశించకుండా అడ్డుకొనేందుకు అంతర్జాతీయ విమాన సేవలు నిలిపివేయాలని ప్రధాని నరేంద్రమోడీకి మొట్టమొదట సూచించింది నేనే. రాష్ట్రంలో కరోనా ప్రవేశించినట్లు తెలియగానే కేంద్రం చెప్పక మునుపే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించి కరోనా కట్టడికి ప్రయత్నించింది మా ప్రభుత్వమే. రాష్ట్రంలో కరోనా ప్రవేశించగానే యుద్ధప్రాతిపదికన ఆసుపత్రులను ఏర్పాటు చేసి, వాటిలో సకల సౌకర్యాలు కల్పించాము. కరోనా విషయంలో మేము ఇంత అప్రమత్తంగా ఉంటూ ఇన్ని చర్యలు తీసుకొంటుంటే ప్రతిపక్షాలు నోటికి వచ్చినట్లు విమర్శిస్తున్నాయి,” అని సిఎం కేసీఆర్‌ అన్నారు. 

కరోనా కేసులు, మరణాలను ప్రభుత్వం దాచిపుచ్చుతోందనే ప్రతిపక్షాల విమర్శలను సిఎం కేసీఆర్‌ ఖండిస్తూ, “ఏ ప్రభుత్వమైన కరోనా మరణాలను దాచి పెట్టుకొంటుందా? దాని వలన ప్రభుత్వానికి ఏమి ఉపయోగం? అయినా ఒక ఇంట్లో వ్యక్తి కరోనాతో చనిపోతే ఇంట్లో వారికి తెలియకుండా ఉంటుందా? ప్రతిపక్షాలు శవరాజకీయాలు చేయడం తగదు. శవరాజకీయాలు చేస్తున్న ప్రతిపక్షాలతో కరోనా గురించి చర్చించవలసిన అవసరం లేదు. దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా పూర్తి అదుపులో ఉంది. కరోనా రికవరీ శాతం కూడా ఎక్కువగా ఉంది. కాంగ్రెస్‌, బిజెపి పాలిత రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ కరోనా మరణాల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. ఇదే ప్రజలకు కూడా తెలియజేస్తూ వారిలో ఆత్మస్థైర్యం పెంచి ఈ విపత్తు నుంచి బయటపడేందుకు గట్టిగా కృషి చేస్తున్నాం. అయినా కరోనా ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉన్నట్లు ప్రపంచంలో మరెక్కడా లేనట్లు, కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందంటూ ప్రతిపక్షాలు మాట్లాడుతుండటం చాలా విడ్డూరంగా ఉంది,” అని అన్నారు.