
తెలంగాణలో ప్రస్తుతం ఉన్న లోపభూయిష్టమైన రెవెన్యూవిధానాలను సమూలంగా ప్రక్షాళన చేసి సరికొత్త విధానాలతో రూపొందించిన కొత్త రెవెన్యూ చట్టానికి సంబందించిన బిల్లుకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు. సిఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం రాత్రి ప్రగతి భవన్లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో వీఆర్వో వ్యవస్థ రద్దుకు ఆమోదం తెలిపారు. అనంతరం రాష్ట్రంలో ఇకపై భూలావాదేవీల ప్రక్రియను కోర్ బ్యాంకింగ్ విధానంలో అమలుచేయాలని నిర్ణయించారు. దీనికోసం రూపొందించిన ‘ది తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్స్ బిల్- 2020’ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బిల్లులను శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టి ఆమోదించి చట్టరూపం దాల్చేవరకు రాష్ట్రంలో స్థిరాస్తుల క్రయవిక్రయాలను రిజిస్టర్ చేయకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.
రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థ రద్దు చేస్తున్నందున సోమవారం ఉదయం నుంచి వీఆర్వోల వద్ద ఉన్న భూరికార్డులను ఆయా జిల్లాల కలెక్టర్లు స్వాధీనం చేసుకొన్నారు.