11.jpg)
తెలంగాణ ప్రభుత్వం వీఆర్ఓలకు ఇవాళ్ళ పెద్ద షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో వీఆర్ఓలందరూ తమ వద్ద ఉన్న రెవెన్యూ రికార్డులను ఇవాళ్ళ మధ్యాహ్నం 12 గంటలలోగా జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్ఓల వద్ద నుంచి రికార్డుల సేకరణ పని మధ్యాహ్నం 3 గంటలలోగా పూర్తిచేయాలని కలెక్టర్లకు గడువు కూడా విధించారు. రికార్డులు స్వాధీనం చేసుకొన్న తరువాత సాయంత్రంలోగా వాటికి సంబందించిన పూర్తి వివరాలతో నివేదికలు పంపించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
తెలంగాణ ప్రభుత్వం రేపు శాసనసభలో కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టబోతోంది. కొత్త చట్టం ప్రకారం రెవెన్యూ వ్యవస్థలో వీఆర్ఓ పోస్టులు ఉండవు. వారినందరినీ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖకు బదిలీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కనుక వారివద్ద ఉన్న రెవెన్యూ రికార్డులన్నిటినీ వెంటనే స్వాధీనం చేసుకోవలసిందిగా జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.
రెవెన్యూ చట్టంలో మార్పులను తాము కూడా స్వాగతిస్తున్నామని కానీ అతితక్కువ జీతాలకు ప్రజలకు సేవలందిస్తున్న తమను ప్రభుత్వం అవినీతిపరులుగా ముద్రవేసి తొలగించడం సరికాదని వీఆర్ఓ సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
రెవెన్యూ వ్యవస్థలో అవినీతి, లంచగొండితనం విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతుండటమే కాక దాని వలన ప్రభుత్వానికి చాలా చెడ్డపేరు వస్తోందని భావించిన సిఎం కేసీఆర్ రెవెన్యూ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి, పూర్తిపారదర్శకంగా, సరళమైన విధానాలతో ఉండేవిధంగా రూపొందిస్తున్నారు.