ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి కోటి పదిలక్షలు లంచం తీసుకొంటూ ఏసీబీకీ పట్టుబడిన కీసర తహశీల్దార్ నాగరాజు, ఆ భూవివాదం వ్యవహారాన్ని సెటిల్ చేయమని మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, కీసర ఆర్‌డీఓ రవి తనను ఆదేశించడం వలననే వెళ్ళానని ఏసీబీ విచారణలో చెప్పిన సంగతి తెలిసిందే. నాగరాజు ఆరోపణలను కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఆర్‌డీఓ రవి ఖండించారు. కానీ ఆ ఆరోపణలలో నిజానిజాలు కనుగొనేందుకు ప్రభుత్వం అంతర్గత విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. దీనిని ప్రభుత్వం ఇంకా దృవీకరించవలసి ఉంది. ఒకవేళ విచారణ మొదలవడం నిజమైతే, దానికి సంబందించిన నివేదిక ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ ద్వారా సిఎం కేసీఆర్‌కు అందజేయబడుతుంది. కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, కీసర ఆర్‌డీఓ రవిలకు ఈ వ్యవహారంతో సంబంధం ఉందని ప్రాధమిక ఆధారాలు లభిస్తే అప్పుడు సిఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొంటారు.
నాగరాజు చెపుతున్నట్లు కీసర, రాంపల్లి దయారా భూవివాదానికి సంబందించిన ఫైలు అసలు తమ వద్దకు రానే లేదని, దానిని తాము చూడనే లేదని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, కీసర ఆర్‌డీఓ రవిలు చెప్పారు. సాధారణంగా అటువంటి భూవివాదాలు తహసిల్దార్ స్థాయిలోనే పరిష్కరించబడుతుంటాయని, కనుక ఆ భూవివాదం, కోటి పదిలక్షలు లంచంతో తమకు అసలు సంబందమే లేదని వారు తెలిపారు.