శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో బుదవారం సాయంత్రం హటాత్తుగా వరుస ప్రేలుళ్ళు సంభవించాయి. కొన్ని రోజుల క్రితమే ప్లాంటులో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 9 మంది సాటి ఉద్యోగులు చనిపోవడం ఇంకా కళ్ళలో మెదులుతూ ఉండగా మళ్ళీ హటాత్తుగా భారీ శబ్ధాలతో వరుసగా ప్రేలుళ్ళు జరగడంతో ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు తీశారు. యంత్ర పరికరాలను ప్లాంటులోకి తీసుకు వెళుతున్న ఒక డీసీఎం వాహనం పక్కనే నేలపై ఉన్న విద్యుత్ కేబిల్స్ పై నుంచి వెళ్లినప్పుడు అవి నలిగి షార్ట్ సర్క్యూట్ అయ్యుండవచ్చని ఉద్యోగులు భావించారు. కానీ ఆ ప్రేలుళ్ళు ఉద్యోగుల అప్రమత్తతను పరిశీలించేందుకు చేసిన మాక్ డ్రిల్ అని తెలియడంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకొన్నారు.
అయితే శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో మళ్ళీ అగ్నిప్రమాదం జరిగిందంటూ మీడియాలో వార్తలు రావడంతో జెన్‌కో ఎండీ ప్రభాకర్ రావు వెంటనే స్పందించి, అది కేవలం మాక్ డ్రిల్ మాత్రమేనని ప్లాంటులో ఎటువంటి అగ్నిప్రమాదం జరుగలేదని మీడియాకు వివరణ ఇచ్చారు. ఇటీవల జరిగిన అగ్నిప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఒకవేళ మళ్ళీ అటువంటి ప్రమాదం జరిగితే లోపల ఉన్న ఉద్యోగులు ఏవిధంగా తప్పించుకొని బయటపడాలి? అని తెలియజేసేందుకే ఇవాళ్ళ సాయంత్రం ప్లాంటులో మాక్ డ్రిల్ నిర్వహించమని ప్రభాకర్ రావు చెప్పారు.